శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 27 జులై 2019 (17:49 IST)

లసిత్ మలింగ రిటైర్మెంట్.. స్పందించిన రోహిత్ శర్మ

శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కొలంబోలోని ప్రేమదాస మైదానంలో మలింగ తన చివరి వన్డే ఆడాడు. 2011లో టెస్టులకు వీడ్కోలు చెప్పిన మలింగ.. వన్డేల నుండి కూడా తప్పుకున్నాడు. మలింగ కేవలం టీ20లు మాత్రమే ఆడనున్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు మలింగ ఆడుతాడు. 
 
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 91 పరుగుల తేడాతో విజయం సాధించి మలింగకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మ్యాచ్‌లో మలింగ 9.4 ఓవర్లు వేసి కేవలం 38 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 2004లో వన్డేల్లో అరంగేట్రం చేసిన మలింగ 226 వన్డేలు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక తరఫున మురళీధరన్ (534), వాస్ (400) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 
 
కాగా.. గత పదేళ్లుగా ముంబై ఇండియన్స్‌కు మ్యాచ్‌ విన్నర్‌ లసిత్‌ మలింగనే అని టీమిండియా వైస్‌ కెప్టెన్‌, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌ శర్మ అన్నాడు. లసిత్ మలింగా రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో రోహిత్ శర్మ తన అధికారిక ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ముంబైకి కెప్టెన్‌గా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తనకు ఎంతో అండగా నిలిచాడు. కొన్ని సందర్భాల్లో ఊపిరి పీల్చుకోవడానికి మలింగనే కారణమని కొనియాడాడు.