సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (10:59 IST)

ట్వంటీ20 వరల్డ్ కప్ : వేడ్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ - ఫైనల్లో పాకిస్థాన్ చిత్తు

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో గురువారం రాత్రి రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ జట్టును చిత్తుగా ఓడించింది. మరో ఓవర్ మిగిలుండగానే పాక్​ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఫైనల్ పోరులో తమ చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. 
 
ఈ టోర్నీలో పాకిస్థాన్‌ జైత్రయాత్రకు ఆస్ట్రేలియా బ్రేక్‌ వేసింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గి సెమీస్‌కు చేరిన పాక్‌కు రెండో సెమీ ఫైనల్‌లో ఆసీస్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. పాకిస్థాన్‌ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఒక ఓవర్‌ మిగిలుండగానే ఛేదించి ఫైనల్లో అడుగుపెట్టింది. 
 
ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్ (49), మార్కస్ స్టాయినిస్‌ (40) రాణించారు. చివర్లో మాథ్యూ వేడ్‌ (41) వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 17 బంతుల్ల 41 పరుగులు చేశాడు. షాహీన్‌ ఆఫ్రిది వేసిన 19వ ఓవర్‌లో వేడ్‌ చివరి మూడు బంతులకు మూడు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. పాక్ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టినా ఆ జట్టుకి ఓటమి తప్పలేదు. షాహీన్ ఆఫ్రిది ఒక వికెట్ తీశాడు.
 
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పాకిస్థాన్‌కు ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (67), బాబర్‌ అజామ్‌(39) మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. మ్యాక్స్‌వెల్‌ వేసిన మూడో ఓవర్‌లో చెరో ఫోర్‌ కొట్టగా.. హేజిల్‌వుడ్ వేసిన ఐదో ఓవర్‌లో రిజ్వాన్ ఓ సిక్సర్ బాదాడు. ఫలితంగా పాక్‌ 9 ఓవర్లకు 68/0తో నిలిచింది. 
 
ఈ క్రమంలోనే జంపా వేసిన పదో ఓవర్‌లో చివరి బంతికి బాబర్‌ అజామ్‌.. వార్నర్‌కి చిక్కాడు. అనంతరం ఫకార్‌ జమాన్‌(55)తో జట్టు కట్టిన రిజ్వాన్ జోరు పెంచాడు. జంపా వేసిన వేసిన 12 ఓవర్‌లో వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాదాడు. హేజిల్‌వుడ్ వేసిన 17వ ఓవర్‌లో రిజ్వాన్‌ ఫోర్‌, సిక్సర్‌ బాదగా.. జమాన్‌ కూడా సిక్స్‌ బాదాడు. దీంతో ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. 
 
అయితే, స్టార్క్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో రిజ్వాన్‌.. స్మిత్‌కి చిక్కాడు. అదే ఓవర్లో జమాన్‌ ఫోర్‌, సిక్స్ కొట్టాడు. 19 ఓవర్‌లో అసిఫ్‌ అలీ (0), చివరి ఓవర్‌లో షోయబ్‌ మాలిక్ (1) వెనుదిరిగారు. ఆఖరి ఓవర్‌లో ఫకార్‌ జమాన్‌ రెండు సిక్స్‌లు బాదడంతో పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు, కమిన్స్‌, జంపా తలో వికెట్ తీశారు.