ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (10:33 IST)

విరాట్ కోహ్లీకి ఓ లక్ష్యాన్ని నిర్దేశించిన రాహుల్ ద్రావిడ్!!

rahul dravid
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారు. బీసీసీఐతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ముగిసిపోయింది. దీంతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత ఆయన ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆఖరి రోజు కూడా విధులను నిర్వర్తించాడు. వెళ్తూ వెళ్తూ కోహ్లికి ఓ బాధ్యతను అప్పగించాడు. టెస్టుల్లోనూ టీమిండియా ఛాంపియన్‌గా నిలవాలని అన్నాడు. "తెల్లబంతితో ఆ మూడూ మనం సాధించాం. ఇక ఎరుపే ఉంది. అది కూడా సాధించండి" అని డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లితో ద్రవిడ్ చెప్పాడు. ఈ వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
 
ద్రావిడ్ దృష్టిలో మూడు అంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మూడు ప్రపంచ ట్రోఫీలు అన్నమాట. ఒకటి టీ20 ప్రపంచకప్, రెండోది వన్డే ప్రపంచకప్.. మూడోది ఛాంపియన్స్ ట్రోఫీ. ఆటగాడిగా కోహ్లి ఈ మూడూ గెలిచాడు. ఇక మిగిలింది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్పే. భారత జట్టు రెండు సార్లు.. 2021, 2023లో డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్ గెలిచాక కోహ్లి అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీమిండియా ప్రస్తుతం తుపాను కారణంగా బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. జట్టు ప్రత్యేక విమానంలో భారత్‌కు రానున్నట్లు సమాచారం. సహాయ సిబ్బంది, కుటుంబాలు, అధికారులు సహా భారత బృందంతో మొత్తం 70 మంది సభ్యులున్నారు. వీరికోసం ప్రత్యేకంగా జంబో చార్టెడ్ ఫ్లైట్‌ను నడిపేలా బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది.