వివేకా హత్య కేసులో కీలక పరిణామం - ఆయనకు సుప్రీం నోటీసులు!
ఏపీ మాజీమంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బెయిలుపై ఉన్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలని సునీత తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ప్రథమ ధర్మాసనం... వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి సంబంధం ఏమిటని ప్రశ్నించింది.
జస్టిస్ సంజీవ్ ఖన్నా అడిగి ప్రశ్నకు సునీత తరపు న్యాయవాదులు సమాధానిమిస్తూ, వివేకా చనిపోయి తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల్లో ఉదయ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు, వివేకా మరణాన్ని గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన వ్యక్తుల్లో ఆయన ఒకరని చెప్పారు. దీంతో ఉదయం కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. గతంలో దాఖలైన బెయిల్ రద్దు పిటిషన్‌లతో కలిసి ఈ పిటిషన్‌ను విచారిస్తామని తెలిపింది. ఆ తర్వాత వివేకా హత్య కేసు విచారణను వాయిదా వేసింది.
2019లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మార్చి 15వ తేదీన పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేశారు. అయితే, పోస్ట్ మార్టం నివేదికలో గుండెపోటు కాదు.. గొడ్డలివేటు వల్ల చనిపోయినట్టు తేలింది. వివేకా శరీరంపై ఏడు చోట్ల గొడ్డలి గాయాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు.