శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (07:47 IST)

24 నుంచి మూడో టెస్ట్ : మొతేరా పిచ్ ఎవరికి అనుకూలం?

ఈ నెల 24వ తేదీ నుంచి భారత్, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో మూడు, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ స్టేడియంలో తొలిసారి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు.  
 
ఆధునాతన సౌకర్యాలతో లక్షా 10వేల సీటింగ్‌ కెపాసిటీతో నూతనంగా నిర్మించిన మొతేరా స్టేడియం ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్‌ మైదానంగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24 నుంచి డే నైట్‌ టెస్టుకు అన్ని హంగులతో సిద్ధమవుతుంది. ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారినవేళ ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అర్హతకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది.
 
ఈ నేపథ్యంలో మొతేరా పిచ్‌ ఎలా ఉండబోతుందనే విషయంపై చర్చ సాగుతోంది. మొదటి రెండు టెస్టులు జరిగిన చెన్నై పిచ్‌కు, అహ్మదాబాద్‌ పిచ్‌కు చాలా తేడా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ మూడో టెస్టు డై నైట్‌ తరహాలో జరగనుండడంతో పిచ్‌ రిపోర్ట్‌పై మరింత ప్రాముఖ్యత సంతరించుకొంది. 
 
సాధారణంగా టీమిండియా టెస్టు మ్యాచ్‌లు ఆడే పిచ్‌లు స్పిన్నర్లకు అనువుగా ఉండేలా క్యూరేటర్లు తయారు చేస్తుంటారు. అయితే కొన్నేళ్లుగా వీటిలో మార్పు కనిపిస్తూ వచ్చింది. స్పిన్నర్లతో పాటు పేసర్లకు కూడా స్వర్గధామంగా నిలుస్తూ వచ్చాయి. 
 
తాజాగా మొతేరాలో పిచ్‌ నల్లమట్టి, ఎర్రమట్టి కాంబినేషన్‌తో కూడి ఉంది. ప్రధాన గ్రౌండ్‌లో 11పిచ్‌లు ఉన్న నేపథ్యంలో ఈసారి పిచ్‌ను స్పిన్నర్లుకు అనూకూలంగా ఉండేలా ఎర్రమట్టితో రూపొందించనున్నట్లు సమాచారం. మొదటి మూడు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా, చివరి రెండు రోజులు మాత్రం బౌలర్లకు అనుకూలించేలా పిచ్‌ను తీర్చిదిద్దారు.
 
ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా ఇప్పుడు ఎక్కువగా స్పిన్నర్లను నమ్ముకోవడంతో తుది జట్టులో ఇద్దరు పేసర్లకు మాత్రమే అవకాశం ఉంది. అయితే క్యురేటర్లు మాత్రం పిచ్‌ను స్పిన్‌కు అనుకూలించే విధంగా రూపొందించినట్లు తెలిపారు. దీంతో పాటు మ్యాచ్‌ డే నైట్‌ కావడం.. రాత్రిళ్లు మంచుతో బౌలర్‌కు గ్రిప్పింగ్‌ చేజారడం జరుగుతుంటుంది. 
 
బంతి రంగు కూడా పిచ్‌పై కీలకపాత్ర పోషించనుంది. అందుకే పిచ్‌పై పచ్చిక ఎక్కువ లేకుండా చూసుకుంటూ కాస్త కఠినతరంగా రూపొందించనున్నారు. ఇక 2012లో మొతేరా మైదానంలో చివరి మ్యాచ్‌ జరిగింది. కాగా ఇటీవలే ముస్తాక్‌ అలీ ట్రోఫీ నాకౌట్‌ మ్యాచ్‌లకు కూడా ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.