1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 మే 2025 (09:23 IST)

ఐపీఎల్ 2025 : ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన హైదరాబాద్!!

hyd sun risers
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌ ఆశలు గల్లంతయ్యాయి. సోమవారం ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఈ టోర్నీ నుంచి హైదరాబాద్ జట్టు నిష్క్రమించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత భారీ వర్షం కువడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ఫీల్డ్ అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ ఫలితంతో 11 మ్యాచ్‌లలో 13 పాయింట్లు సాదించిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్‌ రేసులో నిలువగా కేవలం 7 పాయింట్లతో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లను నామమాత్రంగా ఆడనుంది. 
 
సన్ రైజర్స్‌ విజయానికి 134 పరుగులు అవసరమైన దశలో భారీ వర్షం ప్రారంభమైంది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మైదానం చిత్తడిగా మారిపోయింది. ఔట్‌ఫీల్డ్‌లో నీరు నిలిచిపోవడంతో ఆటను కొనసాగించడం సాధ్యంకాలేదు. పరిస్థితులు సమీక్షించిన మ్యాచ్ అధికారులు రాత్రి 11.10 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అధికారికంగా ప్రటించారు. 
 
దీంతో పాయింట్లు పంచుకున్న ఇరు జట్లు డ్రెస్సింగ్ రూమ్‌కు పరిమితమయ్యాయి. గత యేడాది ఫైనల్స్ చేరిన సన్ రైజర్స్.. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. బౌలర్లు రాణించిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పరువు నిలుపుకుందామని భావించిన హైదరాబాద్ జట్టుపై వరుణుడు నీళ్లు చల్లాడు.