ఆదివారం, 26 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (09:44 IST)

ప్రపంచ కప్‌లో నేటి నుంచి టీమిండియా దండయాత్ర

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా భారత క్రికెట్ జట్టు తన తొలి మ్యాచ్‌ను బుధవారం ఆడనుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టుతో కోహ్లీ సేన తలపడనుంది. ఇందుకోసం సర్వసన్నద్ధంగా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు సౌథాంప్టన్ వేదికగా తలపడనుంది.
 
ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య 4 మ్యాచ్‌లు జరగ్గా అందులో మూడింట్లో సఫారీలు విజయం సాధించగా భారత్ ఒకే మ్యాచ్‌లో గెలిచింది. విరాట్ కోహ్లీ, ధోనీ, ధవాన్, రోహిత్ ఇలా అందరూ కూడా ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అయితే వరుస రెండు మ్యాచ్‌లు ఓడిన సఫారీ జట్టుకు ఈ మ్యాచ్ చావోరేవో అనే చెప్పాలి. 
 
మరోవైపు, టీమిండియా అనగానే బ్లూ కలర్ యూనిఫాం అని ఎవరైనా చెప్పేస్తారు. అందుకే, భారత జట్టును మెన్‌ఇన్ బ్లూ అని కూడా పిలుస్తుంటారు. అయితే, తొలిసారిగా భారత క్రికెటర్లు మరో రంగు దుస్తుల్లో కనువిందు చేయనున్నారు. ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్‌లో ఎంపికచేసిన మ్యాచ్‌ల్లో ఆరెంజ్ కలర్ జెర్సీలు ధరించనున్నారు. 
 
అయితే ఆ మ్యాచ్‌లు ఏంటన్నవి తెలియరాలేదు. మొత్తమ్మీద టీమిండియాను ఎప్పుడూ ఒకే రంగులో చూస్తున్న అభిమానులకు ఇది కాస్త మార్పు అని చెప్పాలి. మరి కాషాయ దుస్తుల్లో కోహ్లీ సేన ఎలా కనిపిస్తుందో చూడాలి.