ప్రియుడి దీర్ఘాయువు కోసం వివాహిత కర్వాచౌత్ పూజ: చెట్టుకి కట్టేసి అర్ధనగ్నంగా హింసించారు
ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోని ఒక గ్రామంలో దారుణ సంఘటన జరిగింది. కట్టుకున్న భర్త దీర్ఘాయువు కోసం చేసే ఉత్తరాది పండుగ కర్వాచౌత్ రోజున ఓ వివాహిత తన ప్రియుడి కోసం పూజ చేసిందని ఆరోపిస్తూ వివాహితను, ఆమె ప్రేమికుడిని గ్రామస్థులు దారుణంగా కొట్టి హింసించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ అవుతున్న ఈ వీడియోలో మహిళను చెట్టుకు కట్టివేసినట్లు కనబడుతోంది. ప్రియుడి చేతులు వెనుకకు కట్టివేసి రోడ్డుపై పడేసారు. గ్రామస్తులు జంటపై దుర్భాషలాడుతున్నారు, పలువురు ఈ దాడిని ప్రోత్సహిస్తున్నారు. ఆందోళన కలిగించే ఫుటేజీలో, ఒక వ్యక్తి ఆ మహిళను కనికరం లేకుండా కొట్టడం చూడవచ్చు, అయితే సమీపంలోని ఇతర మహిళలు ఆమెకు హాని చేయవద్దని కోరారు. అయినప్పటికీ హింస కొనసాగుతోంది.
వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడుతూ... ఆమె చేతులు కట్టి, ఆమెను అక్కడ నగ్నంగా నిలబడనివ్వండి అంటూ భయానక వ్యాఖ్యలు చేస్తున్నాడు. వీడియో ప్రారంభం కావడానికి ముందే మహిళను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించినట్లు ఆమె వంటిపై చిరిగిపోయినట్లు కనిపిస్తున్న దుస్తులను బట్టి అర్థమవుతోంది. ఆమె తన శరీరాన్ని దాచుకునే ప్రయత్నంలో తన దుస్తులను పట్టుకుని రోదిస్తూ కనిపించింది.
స్థానికుల్లో కొందరు తెలిపిన వివరాల ప్రకారం, గుర్గావ్‌లో పనిచేస్తున్న మరొక వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ, తన కర్వాచౌత్ ఉపవాసాన్ని విరమించమని తన ప్రేమికుడిని పిలిచింది, ఇది సాంప్రదాయకంగా వివాహిత మహిళలు తమ భర్త దీర్ఘాయువు కోసం పాటించే ఆచారం. కానీ ఆమె తన భర్తకి బదులు ప్రియుడిని పిలవడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహానికి గురై వాళ్లిద్దరిపై దాడి చేసారు.
మహిళను చెట్టుకి కట్టివేయగా, ఆమె ప్రేమికుడిని తాడుతో కట్టి బలవంతంగా నేలపై పడేసారు. ఈ దారుణం జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల గ్రామస్తులు వున్నప్పటికీ హింసను ఆపడానికి ఎవరూ జోక్యం చేసుకోలేదు, గంటల తరబడి దుర్భాషలాడుతూ వారిని వేధించారు. ఈ వ్యవహారంపై అధికారికంగా ఫిర్యాదు చేశామని, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.