వేధిస్తున్న కుమారుడిని హతమార్చిన తల్లి... ఎక్కడ?
దారితప్పిన ఓ కుమారుడిని కన్నతల్లి హతమార్చింది. అతను పెట్టే వేధింపులను భరించలేని ఆ తల్లి ఈ దారుణానికి పాల్పడింది. ఆ హత్యకు ఆ తల్లి కుమార్తె (మృతుడి చెల్లి) కూడా సహకరించింది. ఈ దారుణం విజయవాడ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
విజయవాడకు చెందిన ఓ యువకుడు గంజాయి సేవనంతో పాటు ఇతర చెడు అలవాట్లకు బానిసయ్యాడు. నిత్యం ఇంటికి వచ్చి తల్లిని వేధింపులకు గురిచేయసాగాడు మద్యం, గంజాయి బానిసగా మారి డబ్బుల కోసం తల్లిని నిత్యం వేధించసాగాడు. ఈ వేధింపులు నానాటికీ పెరిగిపోతుండటంతో కన్నకొడుకు అనే విషయాన్ని కూడా ఆ వేధింపులు మర్చిపోయేలా చేశాయి.
కాళిక మాతగా మారిన ఆ తల్లి కన్నబిడ్డను చంపేసింది. ఈ ఘటనకు మృతుడి చెల్లి కూడా సహకరించింది. అయితే, ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి పేరు దేవ్ కుమార్. హత్య చేసిన తల్లి పేరు మాధవి. వీరికి అలీఖాన్ అనే మరో వ్యక్తి కూడా సహకరించారు. పీకనొక్కి శ్వాస ఆడకుండా చేసి చంపేసినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
తాము పనికి వెళ్ళి వచ్చేసరికి చనిపోయివున్నాడంటూ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలుత అనుమానాస్పదంగా కేసు నమోదు చేసిన పోలీసులు... పోస్టుమార్టం నివేదిక తర్వాత హత్య కేసుగా నమోదు చేసి మృతుడి తల్లి, చెల్లి, సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.