సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (08:55 IST)

వరంగల్‌లో బీజేపీ నేత ఆత్మహత్య హత్య.. నమ్మినవారు ముంచేశారంటూ..

suicide
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో బీజేపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. నమ్మినవారు ముంచేశారంటూ ఆరోపిస్తూ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో తీసి పార్టీ నేతలందరికీ షేర్ చేసిమరీ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, వరంగల్ జిల్లా ఎనుమాల బాలాజీ నగర్‌కు చెందిన బీజేపీ నేత గంధం కుమారస్వామి (45) స్థానికంగా ఉండే వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారం చేస్తూనే తెరాసలో కొనసాగుతున్నారు. వరంగల్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో ఆయన తెరాస నుంచి కార్పొరేటర్‌గా బరిలోకి దిగాలని భావించారు. 
 
తెరాస నేతలు టిక్కెట్ ఇవ్వకపోవడంతో పార్టీని వీడి బీజేపీలో చేరి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల సమయంలో ఖర్చుల కోసం ఎనుమాముల మాజీ సర్పంచ్ సాంబేశ్వర్ నుంచి రూ.25 లక్షల అప్పు తీసుకున్నారు. ఆ రుణం చెల్లించాలని ఆయన ఒత్తిడి చేయసాగారు. తీసుకున్న అప్పు చెల్లించలేక, సాంబేశ్వర్ చేస్తున్న ఒత్తిడిని భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఆయన సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. 
 
మాజీ సర్పంచ్ వేధింపులు ఎక్కువయ్యాయని, ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. నమ్మినవారు తనను మోసం చేశారని కన్నీరు పెట్టుకున్నారు. తన భార్యా పిల్లలను వేధించవద్దని అందులో వేడుకున్నారు. ఈ వీడియోను తన మిత్రులు, వ్యాపారులకు, బీజేపీ నేతలకు పంపించి ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
ఆ సమయంలో ఆయన భార్య కూడా ఇంట్లో మరో గదిలో ఉండటం గమనార్హం. కుమారస్వామికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా, తన భర్త ఆత్మహత్యకు సాంబేశ్వర్, ఆయన భార్య ప్రమీల, కోట విజయకుమార్‌లు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని కుమారస్వామి భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.