గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (19:38 IST)

సోనియా కంటే కేసీఆర్ మాట శక్తివంతమైనదా? పీకేకి కేసీఆర్ ఆ హామీ ఇవ్వడంతో యూటర్న్?

kcr
కేసీఆర్. గత కొన్ని రోజులుగా కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. భాజపాను కూకటివేళ్లతో పెకలించివేయాలనీ, ఆ పార్టీని అధికారం నుంచి దించినప్పుడే దేశం బంగారు భారతదేశంగా మారుతుందని చెపుతున్నారు. ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది ప్రాంతీయ పార్టీల నాయకులతో చర్చలు జరుపుతూ వచ్చే 2024 ఎన్నికల్లో భాజపాను చిత్తుచిత్తుగా ఓడించాలని చెపుతున్నారు.

 
ఇదంతా ఒక ఎత్తయితే ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా యూ టర్న్ తీసుకోవడంలో కేసీఆర్ వున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పూర్తిగా కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ ఇక బతికి బట్టకట్టలేదనీ, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి కూడా లేదని గతంలోనే చెప్పారు కేసీఆర్. తాజాగా పలు కీలక విషయాలపై కేసీఆర్-పీకే మధ్య జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

sonia-PK
రేపు తెరాస ప్లీనరీలో కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారనీ, దక్షిణాది నుంచి భారతీయ జనతా పార్టీ-కాంగ్రెస్ పార్టీలకు సవాలు విసరబోతున్నారంటూ చర్చ జరుగుతోంది. కేసీఆర్ పార్టీని ప్రకటించడమే కాదు... ఆ పార్టీలో కీలక పాత్రను పీకే అప్పగించబోతున్నారంటూ సమాచారం. ఆ హామీ ఇవ్వడంతోనే పీకే యూ టర్న్ తీసుకున్నారని అంటున్నారు.

 
ఏదేమైనప్పటికీ వచ్చే 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని, ప్రధాని మోదీని మోదుకునేందుకు కేసీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ ప్రయత్నాలకు పీకే కూడా తోడైతే ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సిందే.