సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: సోమవారం, 17 జూన్ 2019 (15:35 IST)

సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏమైంది.. కొరివితో తల గోక్కుంటున్నారా..?

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రస్తుతం మంచి పరిపాలన అందిస్తున్నారన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థికభారం పడకుండా అలాఅని అప్పులు చేసి ప్రభుత్వంతో లోటు బడ్జెట్లో తోసెయ్యకుండా రావడం రావడంతోనే అన్ని ప్రాజెక్టులను ఆపేశారు. అయితే నిరుపేదల కోసం మాత్రం కొన్ని పథకాలను తీసుకొచ్చి వాటి కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు.
 
ఇదంతా బాగానే ఉన్నా జగన్ ఒక్క విషయంలో మాత్రం తప్పు చేస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే ప్రత్యేక హోదా. ఎపికి ప్రత్యేక హోదా అనేది తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నదే. కేంద్రంలో బిజెపిపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి చివరకు తెగతెంపులు వరకు ఆ వ్యవహారం వెళ్ళిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. హోదా విషయం కాస్త బిజెపి.. టిడిపి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా మారిపోయిందన్నది అందరికీ తెలిసిన విషయమే.
 
అయితే ఎపిలో కొత్త ప్రభుత్వం వచ్చింది ఇక ప్రత్యేక హోదా ఉద్యమం గురించి పెద్దగా పట్టించుకోరని అందరూ భావించారు. కానీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదాపై ఇప్పటికే ప్రధాని, హోంమంత్రిని కలిసి వివరించారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేస్తున్నాయి. అందుకే మోడీ ఎపికి ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదు.
 
కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తే కేంద్రంతో ఇబ్బందులు పడాలే తప్ప వచ్చే లాభమేమీ ఉండబోదంటున్నారు విశ్లేషకులు. ముందు పరిపాలనపై పట్టు సాధించాలే తప్ప బిజెపితో పెట్టుకుని అనవసరంగా కొరివితో తలగోక్కోవడం ఏమిటంటున్నారు విశ్లేషకులు. మరి జగన్... తన దూకుడుతో ఇలాగే హోదాపై పోరాటం చేస్తారో లేకుంటే బిజెపితో సఖ్యతగా ఉండేందుకు హోదా విషయాన్ని పక్కనబెడతారో వేచి చూడాల్సిందే.