1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By selvi
Last Updated : శనివారం, 20 జనవరి 2018 (16:47 IST)

వసంత పంచమి రోజున సరస్వతిని పూజిస్తే.. (Video)

వసంత పంచమి ఈ నెల (జనవరి 22)న రానుంది. మాఘశుద్ధ పంచమినే వసంత పంచమి అంటారు. ఈ రోజు సరస్వతీ పూజ చేయడం మంచిది. వసంత పంచమిని సరస్వతీ దేవి పుట్టిన రోజుగా పేర్కొంటారు.

వసంత పంచమి ఈ నెల (జనవరి 22)న రానుంది. మాఘశుద్ధ పంచమినే వసంత పంచమి అంటారు. ఈ రోజు సరస్వతీ పూజ చేయడం మంచిది. వసంత పంచమిని సరస్వతీ దేవి పుట్టిన రోజుగా పేర్కొంటారు. 
 
"మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ
పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయతః శుచిః - అంటే మాఘ శుక్ల పంచమినాడు, విద్యారంభంనాడు ప్రాతఃకాలాన సరస్వతిని అర్చించాలి. తొలుత గణపతిని పూజించి, అటుపై శారదాంబ ప్రతిమను, పుస్తకాలను, లేఖినిని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి. 
 
సరస్వతీ దేవిని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో అర్చించాలి. వసంత పంచమినే శ్రీపంచమి అని కూడా పిలుస్తారు. శ్రీపంచమి దక్షిణ భారతదేశంలో అంతగా ప్రచారం లేకపోయినప్పటికీ, ఉత్తర భారతదేశంలో ఈ పంచమి నాడు సరస్వతీ దేవిని అత్యంత శ్రద్ధతో పూజిస్తారు. 
 
ఆదిశంకరుడు అపారమైన వాఙ్మయాన్ని, తత్వవిజ్ఞానాన్ని ఈ తల్లి కృప చేతనే పొందినట్లు పేర్కొనడమే గాక శారదానుగ్రహం వలన మనమందరం సమగ్ర జ్ఞానంతో ఎదగగలమని చాటాడు. గాయత్రిగా, సావిత్రిగా, పరాశక్తిగా శ్రుతులు పేర్కొన్న సర్వచైతన్య స్వరూపిణి శారద. అందుకే వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారని విశ్వాసం. 
 
'యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా
సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః..' అన్న శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీ దేవి కాబట్టి. అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీ దేవీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. సరస్వతీ దేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారని పండితులు సూచిస్తున్నారు. 
 
వసంత పూజను జనవరి 22న ఉదయం 07:17 నుంచి మధ్యాహ్నం 12:32 గంటల్లోపు పూర్తి చేయాలి. వసంత పంచమి తిథి జనవరి 21 సాయంత్రం 3.33 గంటలకు ప్రారంభమై.. 22వ తేదీ 4.24 వరకు వుంటుంది.