సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2023 (13:32 IST)

కేంద్ర వార్షిక బడ్జెట్‌లో సింహభాగం 'రక్షణ' రంగానికే...

defence budget
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్‌లో సింహభాగం నిధులను రక్షణ శాఖకే కేటాయించారు. దీనికి ప్రధాన కారణం లేకపోలేదు. సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ నుంచి పెరుగుతున్న సవాళ్ళ నేపథ్యంలో ప్రధాని మోడీ సర్కారు 2023-24 వార్షిక బడ్జెట్‌లో కూడా రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. ఫలితంగా ఈ దఫా రూ.5.94 లక్షల కోట్లను కేటాయించింది. ఇది మొత్తం బడ్జెట్‌లో 13 శాతం కావడం గమనార్హం. 
 
ముఖ్యంగా ఆయుధాల కొనుగోలుకు కేటాయించే నిధుల శాతాన్ని గణనీయంగా పెంచింది. రక్షణ శాఖకు గత యేడాది రూ.5.25 లక్షల కోట్లు కేటాయించగా, ఈ యేడాది అదనంగా మరో రూ.69 వేల కోట్లను కేటాయించారు. గత ఐదేళ్ల కాలంలో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిధులను రెట్టింపు చేయడం గమనార్హం. 
 
ఈ నిధులను కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, ఇతర మిలిటరీ హార్డ్‌వేర్, యుద్ధ నౌకలు, జలాంతర్గాములను సమకూర్చుకోవడానికి వినియోగిస్తారు.అలాగే, రెవెన్యూ వ్యయం కింద రూ.2,20,137 కోట్లను కేటాయించారు. ఇందులో రక్షణ సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు ఉంటాయి. పెన్షన్ల చెల్లింపులకు ప్రత్యేకంగా రూ.1,38,205 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. 
 
రక్షణ శాఖకు గత 2020-21లో రూ.3,23,053 కోట్లు కేటాయించగా, 2021-22లో ఇది రూ.4,78,196కు పెంచారు. 2022-23లో ఏకంగా రూ.5,25,166 కోట్లకు పెంచగా, ఇపుడు అంటే 2023-24లో రూ.5,93537 కోట్లను కేటాయించారు.