సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2019
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (16:41 IST)

రో"హిట్" నామ సంవత్సరంగా 2019

భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ. వంటి చేత్తో ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన క్రికెటర్. ఈ క్రికెటర్ ధాటికి అనేక రికార్డులు బద్ధలైపోతున్నాయి. పైగా, క్రీజ్‌లో దిగిన తర్వాత తొలుత నెమ్మదిగా బ్యాటింగ్ ఆరంభిస్తాడు. అక్కడ కుదురుకున్నాక బ్యాట్‌ను ఝుళిపిస్తాడు. 
 
అతడి భారీ షాట్లకు స్టేడియంలోని స్టాండ్స్‌ సాక్ష్యాలుగా నిలుస్తాయి. హాఫ్‌ సెంచరీ, సెంచరీ, డబుల్‌ సెంచరీ ఇలా ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ ఏమాత్రం దయలేని ఆటతో ముందుకుసాగుతుంటాడు. ఈ యేడాది అలాంటి ఆటతీరుతోనే క్రికెట్‌ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడైన విరాట్‌ కోహ్లీతో సమానంగా తన బ్యాట్‌ పవరేంటో చాటుకున్నాడు.. అందుకే అక్షరాలా ఇది రోహిత్‌ నామ సంవత్సరంగా క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే, 2019 సంవత్సరం ఏ విధంగా ముగిసిందో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
ఆధునిక క్రికెట్‌లో కింగ్‌గా పేరుగాంచిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. అతడికి ధీటుగా మరో క్రికెటర్‌ను ఊహించుకోవడం చాలా కష్టం. ఆసీస్ క్రికెటర్ స్టీవ్‌ స్మిత్‌ యాషెస్ సిరీస్‌లో సెంచరీల మోత మోగించినా, మయాంక్‌ అగర్వాల్‌ టెస్టుల్లో పరుగుల వరద పారించినా కూడా కోహ్లీ అన్ని ఫార్మాట్ల ఆటగాడిగా అందరికంటే ముందే ఉంటాడు. 
 
కానీ ఈ ఏడాది ఒక్క ఆటగాడు మాత్రం విరాట్‌కు పోటీనిచ్చాడు.. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో అతడిని తలదన్నే ఆటను కూడా ప్రదర్శించాడు. అవును.. అతడే రోహిత్‌ శర్మ. భారత క్రికెట్‌లోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లోనూ 2019 సంవత్సరం ఈ స్టార్‌ ఓపెనర్‌కు అద్భుతంగా కలిసివచ్చింది. తనకు మాత్రమే సాధ్యమయ్యే హిట్టింగ్‌తో జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందించాడు. 
 
ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌ను ఆస్వాదిస్తున్నాడు. అందుకే మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా పది శతకాలతో 2,442 పరుగులు సాధించిన రోహిత్‌.. 22 ఏళ్ల క్రితం జయసూర్య (2,387) నెలకొల్పిన రికార్డును సైతం బద్దలుకొట్టాడు.
 
వన్డే కింగ్‌..
ఈ యేడాది జనవరి 12వ తేదీన సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో అతని పరుగుల ప్రవాహం మొదలైంది. నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో ఒంటరిపోరాటం చేస్తూ అతడు సాధించిన 133 పరుగులకు క్రీడాలోకం ఫిదా అయింది. అప్పటి నుంచి సాగిస్తున్న పరుగుల వేట తాజాగా వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ వరకు ఏమాత్రం విరాం లేకుండా సాగింది. 
 
ముఖ్యంగా, ఈ సిరీస్‌లో తొలి వన్డేలో కోహ్లీ సేన చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత విశాఖలో 159 పరుగులతో జట్టును పోటీలో నిలిపాడు. నిర్ణాయక మ్యాచ్‌లోనూ 63 పరుగులతో చెలరేగి 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్' అవార్డును దక్కించుకున్నాడు. మొత్తంగా ఈ ఏడాది 28 వన్డేల్లో 57.30 సగటుతో అందరికంటే ఎక్కువగా 1,490 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు సెంరీలు ఉండటం గమనార్హం.
 
గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ కేలండర్ ఇయర్‌లో 9 సెంచరీలు చేశాడు. అలాగే 13 అర్థసెంచరీలు సాధించగా, ఇందులో తొమ్మిది జట్టు విజయానికి కారణమయ్యాయి. అటు వన్డేల్లో కోహ్లీ 25 ఇన్నింగ్స్‌లో 59.86 సగటుతో 1377 పరుగులు సాధించి రోహిత్‌ తర్వాతరెండో స్థానంలో ఉన్నాడు. ఐసీసీ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ ఈ ఇద్దరిదే టాప్‌-2 పొజిషన్‌. ఇక అన్ని ఫార్మాట్లలోనూ పరుగుల విషయంలో విరాట్‌ (2,455)కు రోహిత్‌ (2,442)గట్టి పోటీనిచ్చి స్వల్పంగా వెనకబడ్డాడు.
 
బ్యాట్ పట్టుకుని క్రీజులో ఉన్నాడంటే అతడు సంధించే భారీ సిక్సర్లకు ముగ్ధులైన అభిమానులంతా అతడిని హిట్‌మ్యాన్‌గా పిలుస్తుంటారు. దీనికి తగ్గట్టుగానే ఈ ఏడాది అతడు మూడు ఫార్మాట్లలో మరే క్రికెటర్‌ సాధించని విధంగా 78 సిక్సర్లతో పాటు 244 ఫోర్లు సాధించాడు. అంతేకాకుండా భారత్‌ తరపున తొలి వికెట్‌కు రాహుల్‌తో కలిసి 1,008 పరుగులు అందించాడు. ఇందులో ఆరు శతక భాగస్వామ్యాలు వచ్చాయి.