సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (21:21 IST)

చక్కెర వ్యాధికి స్వీట్ రూల్స్, ఇలా చేస్తే డయాబెటిస్ అదుపులో...

డయాబెటిస్, చక్కెర వ్యాధి లేదా మధుమేహంతో బాధపడే రోగులు ఖచ్చితంగా ఆహార నియమాలను పాటించి తీరాలి. అప్పుడే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఈ వ్యాధి బారినపడినవారు ఆహార నియమం గురించి పడే తపన అంతాఇంతా కాదు. అందుకే ముందుగానే ఆహార నియమం కోసం కొన్ని ప్రణాళికలను తయారు చేసుకుంటే చాలా మంచిది. అలాంటి ప్రణాళికా నియమాలు ఇలా ఉండాలంటున్నారు వైద్యులు.
 
ఉదయం 6 గంటలకు: అర చెంచా మెంతి పొడిని నీటిలో కలిపి సేవించాలి.
ఉదయం 7 గంటలకు: టీ తాగే అలవాటుంటే చక్కెర లేని టీ తీసుకోవచ్చు.
ఉదయం 8.30 గంటలకు: ఒక ప్లేటు ఉప్మా లేదా గోధుమ రవ్వతో చేసిన ఉప్మాతోబాటు అరకప్పు మొలకెత్తిన విత్తనాలు, 100 మిల్లీలీటర్ల చక్కెరలేని పాలను ఆహారంగా తీసుకోవాలి.
ఉదయం 10.30 గంటలకు: 50 గ్రాములున్న పండు లేదా 1 కప్పు పలుచటి మజ్జిగ లేదా చక్కెర లేకుండా నిమ్మకాయ రసంను సేవించాలి.
 
మధ్యాహ్నం భోజనం 12.30 గంటలకు: రెండు చపాతీలు, ఒక కప్పు గంజి తీసివేసిన అన్నం, ఒక కప్పు పప్పు, ఒక కప్పు పెరుగు, అర కప్పు సోయాబీన్ లేదా పనీర్, అరకప్పు ఆకుకూరతో పాటు సలాడ్ ఒక కప్పును ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.
 
సాయంత్రం 4 గంటలకు: ఒక కప్పు చక్కెర లేని టీతో పాటు రెండు బిస్కెట్లు తీసుకోవచ్చు(చక్కెర లేనివి).
సాయంత్రం 6 గంటలకు: ఒక కప్పు సూపు తీసుకోవాలి.
రాత్రి భోజనం 8.30 గంటలకు: మధ్యాహ్నం తీసుకున్న ఆహారం మాదిరాగానే రాత్రిపూట కూడా తీసుకోవాలి.
రాత్రి పడుకునే సమయంలో 10.30 గంటలకు: ఒక కప్పు చక్కెర లేని పాలు సేవించాలి.
 
ఒక్కసారిగా ఆహారాన్ని సమపాళ్ళల్లో తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత విపరీతంగా ఆకలి వేస్తుంటుంది. అలా ఆకలి వేస్తే ఈ సూత్రాలు పాటించండి. పచ్చి కూరగాయలు సలాడ్‌గా తీసుకోవాలి. బ్లాక్ టీ, సూప్, పలుచటి మజ్జిగ, నిమ్మకాయ రసం సేవిస్తుండాలి. ఇందులో ముఖ్యంగా చక్కెర, బెల్లం, తేనె, తీపి పదార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.