గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 8 అక్టోబరు 2019 (21:03 IST)

మళ్లీ బెంబేలెత్తిస్తున్న డెంగ్యూ ఫీవర్... ఎలా వస్తుంది? నిరోధించడం ఎలా?

వర్షాలు మొదలైతే చాలు డెంగ్యూ జ్వరం భయపెడుతుంది. ఈ వ్యాధి వ‌చ్చిన వారి ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తీవ్ర‌మైన జ్వ‌రం, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చ‌ర్మంపై ద‌ద్దుర్లు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అస‌లు ఒకచోట స‌రిగ్గా నిలుచోలేరు. కూర్చోలేరు. బెడ్‌కే ప‌రిమితం కావ‌ల్సి వ‌స్తుంది. 
 
గంట‌లు గ‌డుస్తున్న కొద్దీ ఆరోగ్యం మ‌రింత క్షీణించి ప్రాణాల‌కు ప్ర‌మాదం క‌లిగే అవకాశం ఉంటుంది. డెంగ్యూ వచ్చిన వారి ర‌క్తంలో ఉండే ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా బాగా త‌గ్గుతుంది. దీంతో ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. సాధార‌ణ వ్య‌క్తుల్లో ప్లేట్‌లెట్లు 1.50 ల‌క్ష‌ల నుంచి 4.50 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటే, డెంగ్యూ వ‌చ్చిన వారిలో 1.50 ల‌క్షల క‌న్నా త‌క్కువ‌గా ఉంటుంది.
 
గంట‌లు అయిన కొద్దీ ఇవి వేల సంఖ్య‌లో ప‌డిపోతూనే ఉంటాయి. ఈ క్ర‌మంలో ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచ‌డం కోసం వైద్యులు ప‌లు ర‌కాల మందుల‌ను, విట‌మిన్ స‌ప్లిమెంట్ల‌ను రోగుల‌కు అందిస్తారు. రోగి కొద్దిగా కోలుకున్న త‌రువాత డిశ్చార్జి చేస్తారు. కానీ కొన్ని రోజులవ‌ర‌కు వారు మందుల‌ను స‌క్ర‌మంగా తీసుకోవాల్సిందే. స‌రైన ఆహారం తినాల్సిందే. లేదంటే రోగం మ‌ళ్లీ తిర‌గ‌బెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే అలాంటి వారు కింద సూచించిన విధంగా ఓ చిట్కాను పాటిస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను త్వ‌ర‌గా పెంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. తద్వారా డెంగ్యూ వ్యాధి కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది. 
 
బొప్పాయి కషాయంతో తగ్గుతుంది
ఇంత‌కీ ఆ మందు త‌యార‌య్యేది బొప్పాయి ఆకుల‌తోనే... బొప్పాయి పండు ఆకుల‌తో త‌యారు చేసిన ఓ మిశ్ర‌మాన్ని సేవించ‌డం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను బాగా పెంచుకోవ‌చ్చు. ఆ మిశ్ర‌మాన్ని ఎలా త‌యారు చేయాలంటే, కొన్ని బొప్పాయి ఆకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. వాటిని మిక్సీలో వేసి దాంతోపాటు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీరు, ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం, చిటికెడు ప‌సుపుల‌ను కూడా వేయాలి. 
 
అనంత‌రం అన్ని ప‌దార్థాల‌ను బాగా మిక్సీ ప‌ట్టాలి. అప్పుడు వ‌చ్చే ద్ర‌వాన్ని వ‌డ‌బోసి, దానికి కొంత తేనె క‌లిపి నిత్యం రెండు పూట‌లా తీసుకోవాలి. డాక్ట‌ర్ ఇచ్చిన మెడిసిన్స్‌తో పాటు ఈ మిశ్ర‌మాన్ని కూడా తీసుకోవాలి. అప్పుడే గుణం క‌నిపిస్తుంది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పెర‌గ‌డ‌మే కాదు, త్వ‌ర‌గా వ్యాధి నుంచి కోలుకుంటారు కూడా.
 
ఇలా చేస్తే నిరోధించవచ్చు...
 
శరీరాన్ని దోమలు కుట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోండి. దోమలను ఇంటి పరిసర ప్రాంతాల్లో పెరగనీయకండి. వీటిని నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి.
 
ఇంటి ఆవరణలోనున్న నీటి తొట్టెను మూసి ఉంచండి.
 
ఇంటి చుట్టుప్రక్కల నీటిని నిల్వ ఉంచకండి.
 
ప్రతి రోజు కూలర్ వాడుతుంటే క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. ప్రతి రోజు అందులోని నీటిని మార్చేయండి.
 
రాత్రి పడుకునే ముందు శరీరాన్ని పూర్తిగా కప్పుకునేందుకు ప్రయత్నించండి. కాళ్ళకు సాక్సులు వాడండి. 
 
శరీరంపై దోమ నివారణ మందును పూయండి. లేకుంటే దోమతెర వాడండి.
 
ఇంటి పరిసర ప్రాంతాల్లో దోమలు చేరకుండా ఉండేలా చూసుకోండి. డీడీటీ తదితర మందులను ఇంటి పరిసర ప్రాంతాల్లో చల్లేలా చర్యలు తీసుకోండి. అలాగే వేపాకుల పొగబెట్టండి. దీంతో దోమలు దరిచేరవు.