ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 7 మే 2021 (17:30 IST)

కోవిడ్ వ్యాక్సిన్ పట్ల అజాగ్రత్త, నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోకండి

కొంత నిర్లక్ష్యం, మరికొంత అవగాహన లోపం.. కొవిడ్‌ రోగుల్లో తీవ్రతకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అశాస్త్రీయ విధానాలు పాటిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్నేహితులు, సహచరులకు కొవిడ్‌ సోకినట్టు నిర్ధారణ కాగానే కొందరు టీకా కోసం పరుగులు తీస్తున్నారు. అప్పటికే వారిలో కొంతమంది వైరస్‌ బారినపడినా లక్షణాలు కనిపించకపోవడంతో ఇటువంటి తప్పిదాలు చేస్తున్నారని వైద్యులు విశ్లేషిస్తున్నారు. దీంతో టీకా వేసుకున్నాక లక్షణాలు కనిపించినా.. టీకా ప్రభావమనే భ్రమలో గడిపేస్తున్నారు. 
 
అవగాహన అవసరం:
వాస్తవానికి టీకా తీసుకున్నాక కొద్దిమందిలో జ్వరం, ఒళ్లునొప్పులు ఒకటి రెండ్రోజులు మాత్రమే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రజలు మాత్రం టీకా తీసుకున్నాక వస్తున్న లక్షణాలు, కొవిడ్‌ లక్షణాలు ఒకటేనని భాస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు ఏం చేయాలి? తీసుకున్న తర్వాత జాగ్రత్తలు అన్నీ తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు పరిస్థితులు చేయిదాటిపోయి మరణాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంటి వైద్యంతో కాలయాపన చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఒకవేళ పూర్తిగా కోలుకున్నా.. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా టీకా వేయించుకోవాలి.
 
పరీక్షా కేంద్రాల దగ్గర జాగ్రత్త
కోవిడ్ సోకిందనే అనుమానంతో పరీక్షా కేంద్రాలకు వస్తున్న వారు కొందరు వైరస్‌ బారినపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. టీకా కోసం వచ్చినపుడు గుంపులుగా చేరడం, మాస్క్‌ ధరించినా వాటిని కేవలం మూతి వరకే ఉంచుకోవడం, ఊపిరి ఆడటం లేదని ముక్కును కప్పేయకపోవటం, చిరిగిన మాస్క్‌లు తదితర తప్పిదాలతో..  మహమ్మారిని చేతులారా ఆహ్వానించినట్టే అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
వ్యాక్సినేషన్ కేంద్రాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి
అప్పటి వరకు మనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేకపోయినా.. వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లినపుడు అక్కడ కూడా కోవిడ్ సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ కోసం లైన్లో నిలుచున్నపుడు భౌతిక దూరం పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో మాస్కును తీయకూడదు. వ్యాక్సిన్ కేంద్రంలో ఉన్నప్పుడు, మీ చుట్టూ ఉన్న వస్తువులను లేదా ఇతర వ్యక్తులను తాకవద్దు.
 
వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదు:
వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా.. జ్వరం సాధారణమే. ఒకటి,రెండు రోజుల్లో తగ్గిపోతుందని భావించడం సరికాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత నిర్దేశిత సమయానికి రెండో డోసు తీసుకోవాలి. ఆ తర్వాత 14 రోజులకు శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. ఈలోపు కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.

కొందరిలో మొదటి డోసు వేసుకున్నాక స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఒకవేళ జ్వరం తగ్గకుండా దగ్గు, ఆయాసం కూడా అనిపిస్తే అప్రమత్తం అవ్వాలి. అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొందరు మొదటి డోసు తీసుకున్నాక ఏమీ కాదనే ధీమాతో కరోనా నిబంధనలు పాటించకపోవడం మంచిది కాదని.. అలా చేస్తే వారికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.