పాదాలపై దద్దుర్లు ఉన్నా కరోనా వైరస్ సోకినట్టేనా?
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసింది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అలాగే, మృతుల సంఖ్య కూడా ఇలానే వుంది. నిజానికి ఈ వైరస్ సోకినందుకు గుర్తుగా కొన్ని లక్షణాలను వైద్యులు చెప్పారు. ప్రధానంగా, పొడిదగ్గు, విపరీతమైన జ్వరం, తలనొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా కరోనా వైరస్ సోకినట్టుగా అనుమానించవచ్చని పేర్కొన్నారు.
అయితే, పైన పేర్కొన్న లక్షణాలు ఏవీ లేకపోయినప్పటికీ కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ విషయంలో వైద్యులు తాజాగా మరో లక్షణాన్ని గుర్తించారు. పాదాలపై దద్దుర్లు ఉన్నా కరోనా సోకిందని అనుమానించొచ్చని చెబుతున్నారు.
కరోనా వైరస్ సోకిన వారిలో నొప్పితో కూడిన దద్దుర్లు ఎక్కువగా పాదాలు, కాళ్ల బొటన వేళ్లతో పాటు కొన్నిసార్లు చేతులపై కూడా వస్తున్నాయి. ఇవి విపరీతమైన చలి ఉన్నప్పుడు కాలి వేళ్లు ఉబ్బినట్టుగా ఉంటాయి. దీనికి సంబంధించి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవలేదని అంటున్నారు.
ఇటీవల ఇటలీకి చెందిన ఓ అధ్యయనం ప్రకారం.. కరోనా వైరస్ సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరికి చర్మ సంబంధ సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. అంటే బాధితుల చర్మం మీద ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయి. దీన్ని 'కొవిడ్ ఫీట్' అంటారని అంటువ్యాధుల నిపుణుడు సుబ్రమణియం స్వామినాథన్ తెలిపారు.
'ఇటలీలో దాదాపు 20 శాతం మంది బాధితులకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. ఫిన్లాండ్, స్పెయిన్, అమెరికా, కెనడాలోని వైద్యులు కూడా కరోనా బాధితుల్లో చర్మంపై ఎర్రటి మచ్చలు, దద్దుర్లు ఉన్నట్టు గుర్తించారు. మన దేశంలో కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాం' అని ఆయన చెప్పుకొచ్చారు.