ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 30 జనవరి 2019 (20:04 IST)

మిరియాలు శక్తి మీకు తెలిస్తే వాటిని వదిలిపెట్టరు...

భారతీయుల పోపు డబ్బాలో తప్పనిసరిగా మనకు కనిపించే దినుసులలో ముఖ్యమైనవి మిరియాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మిరియాలలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. 
 
సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలకి ప్రత్యేక స్థానముంది. వీటిని మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆహారంలో రుచిని పెంచడానికి మిరియాల ఘాటు తగలాల్సిందే. వంటల్లోనే కాదు.. ఔషధంగా కూడా మిరియాలను ఉపయోగిస్తారు. ఇవి కేవలం నల్లవే కాదు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లోనూ లభిస్తున్నాయి. ఎంతో రుచిని, ఘుమఘుమలను అందించే మిరియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
 
1. చిన్న పిల్లలు ఆహారం తీసుకోవడానికి మారం చేస్తూ ఉంటారు. ఇలా సమయానికి ఆహారం తీసుకోకపోతే.. పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఒక టేబుల్ స్పూన్ బెల్లంలో అరచెంచా మిరియాల పొడి కలిపి ప్రతి రోజూ పిల్లలకు పెట్టడం వలన ఆకలి పెరుగుతుంది.
 
2. మిరియాల పైపొరలో ఫైటో న్యూట్రియంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వుల్ని విచ్ఛిన్నం చేసి అనవసరమైన కొవ్వు పేరుకు పోకుండా కాపాడుతాయి. ఫలితంగా బరువు పెరగకుండా జాగ్రత్తపడడంతో పాటు రక్తనాళాల్లో అధిక కొవ్వు వల్ల వచ్చే రక్తపోటు నుంచి కాపాడుతాయి. కాబట్టి మిరియాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యమే కాదు ఫిట్ గానూ ఉండవచ్చు.
 
3. సాధారణంగా ఆందోళన, ఒత్తిడి చాలామందిని వేధించే సమస్య. కాబట్టి మిరియాలలో ఉండే పైపెరైన్ అనే గుణం ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. 
 
4. చిన్న పిల్లలకు శీతాకాలంలో ఎక్కువగా దగ్గు, జబులు వస్తూ ఉంటుంది. ప్రతిసారి మందులు వాడటం మంచిది కాదు. అందుకే మిరియాల పాలు లేదా మిరియాల రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
5. 50 గ్రాముల మిరియాల పొడిని తీసుకుని దానికి 600 మిల్లీ లీటర్ల నీళ్లు చేర్చి అరగంట మరిగించాలి. ఈ నీటిని వడగట్టి రోజుకి మూడు సార్లు తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
 
6. మిరియాల టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని రోగ నిరోధక వ్యవస్థకు చేరుస్తుంది.
 
7. చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకుంటే కండరాలు, నరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.