సరిగ్గా నిలబడటం ఎలా? అలా నిలబడితే కలిగే ప్రయోజనాలు ఏంటి?

Yoga
జె| Last Updated: గురువారం, 5 మార్చి 2020 (15:16 IST)
రాందేవ్ బాబా
మేము నిలబడే కదా ఉన్నాం.. సరిగ్గా నిలబడడమేంటి అనుకుంటున్నారా... అయితే ఇది చదవండి. నిలబడటం వేరు.. సరిగ్గా నిలబడటం వేరు. అలా సరిగ్గా నిలబడటం ఒక్కసారి నేర్చుకొంటే మీరు అలాగే ప్రతిసారి నిలబడతారు. అందువల్ల మీకు ఎన్నో రకాల లాభాలు ఉన్నాయంటున్నారు యోగాసనాల నిపుణులు. అందుకు తాడాసనం ఒక్కటే మార్గమంటున్నారు. అసలు తాడాసనం ఎలా చేయాలంటే.

తాడ అంటే పర్వతం. పర్వతం మాదిరిగా నిశ్చలంగా నిటారుగా నిలబడటమే తాడాసనం. రెండు పాదాలను దగ్గరగా చేర్చి నిటారుగా నిలబడాలి. రెండు బ్రొటను వ్రేళ్ళు ఒకదానితో ఒకటి తగులుతున్నట్లు పూర్తిగా ఉంచాలి. ముందు వ్రేళ్ళు కొనల నుంచి వెనుక వరకు పాదం పూర్తిగా భూమిని తాకినట్లు ఉంచాలి.

మోకాళ్ళను బిగించాలి. మోకాళ్ళ చిప్పలను పైకి లాగి పట్టుకోవాలి. తొడల వెనుక భాగమును పైకి లాగి పట్టుకోవాలి. కడుపును లోపలికి లాగి పట్టుకోవాలి. రొమ్ము ముందుకు నెట్టాలి. వెన్నెముకను పైకి లాగి నిటారుగా ఉంచుకోవాలి. మెడను నిటారుగా ఉంచాలి.

శరీరం యొక్క పూర్తి బరువును, ముందర పాదములపైన గాని వెనుక మడమలపై గానీ కాక రెండింటిపైనా సమానంగా ఉండేటట్లు చూడాలి. రెండు చేతులను నిటారుగా పైకెత్తి పట్టుకోవాలి. లేకుంటే వీలుగా ఉండేందుకు రెండు చేతులను తొడలకు పక్కగా ఉంచుకోవాలి.

ఇలా చేస్తే ఎన్నో ప్రయోజనాలట. మామూలుగా మనం సక్రమంగా నిలబడం. కొందరు మొత్తం శరీరం బరువును ఒకే కాలిపై వేస్తారు. ఇంకొందరు ఒక కాలును ఒక ప్రక్కకు త్రిప్పి నిలబడతారు. కొద్దిమంది మొత్తం బరువును మడమలపై వేసి నిలబడతారు. కొద్ది మంది పాదముల యొక్క లోపలి భాగాములపైన గానీ బయట భాగములపై గానీ వేసి నిలబడతారు. మనం సక్రమంగా నిలబడక పోవడ వల్ల మొత్తం శరీరం బరువు సమానంగా కాళ్ళపై లేనందువల్ల వెన్నెముక తన సహజగుణమైన స్థితిస్థాపక శక్తిని పోగొట్టుకుందట.

ఎప్పుడైతే కడుపులోపలకు పోయి రొమ్ముపైకి వచ్చి నిటారుగా నిలబడ్డామో శరీరం తేలికగా అనిపించి మనస్సు చురుకుదనంగా ఉంటుందట. కాబట్టి నిలబడడం నేర్చుకోవడం వల్ల ఈ ఆసనం వల్ల సాధ్యమైందంటున్నారు యోగా నిపుణులు.దీనిపై మరింత చదవండి :