బుధవారం, 27 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (17:35 IST)

40 మంది అతిథులతో నిరాడంబరంగా సీతారామ కళ్యాణం

తెలంగాణా రాష్ట్రంలోని భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబ‌రంగా జ‌రిగాయి. కరోనా వైరస్‌ కారణంగా ఈ సారి భక్తజనం లేకుండానే సీతారామ కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు పూర్తిచేశారు. 
 
ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రులు అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్ శ్రీసీతారాముల స్వామివారికి ముత్యాల త‌లంబ్రాలు, ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.  వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణం జ‌రిగింది.
 
ప్రతియేటా మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవారు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి కల్యాణ వేడుక నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, వేదపండితులు, అర్చకులు, ఆల‌య‌, ఇత‌ర శాఖ‌ల అధికారులు ఈ వేడుకకు హాజ‌ర‌య్యారు.
 
మరోవైపు, కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలెవరూ హాజరుకావొద్దని ప్రభుత్వం సూచించింది. దీంతో భక్తులు లేకుండానే కల్యాణ వేడుకలను పూర్తిచేశారు. కేవలం 40 మంది ముఖ్యులు, వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో సీతారాముల కల్యాణ వేడుకలు ముగిశాయి.