గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (09:51 IST)

చైనాలో బుసలు కొడుతున్న కరోనా.. భయం గుప్పెట్లో భారత్

డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా వైరస్ మళ్లీ బుసలు కొడుతోంది. దీంతో భారత్ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, ఇజిన్‌ కౌంటీలో కఠిన ఆంక్షలు విధించిన ప్రభుత్వం.. తాజాగా లాన్‌జువో నగరమంతటా లాక్డౌన్‌ ప్రకటించింది. 
 
కేవలం 40 లక్షల మంది జనాభా ఉన్న ఈ సిటీలో కొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ కట్టడికి అధికారులు కఠిన ఆంక్షలు తీసుకొచ్చారు. నగరవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించారు. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని ఆదేశించారు. సోమవారం ఒక్కరోజునే చైనావ్యాప్తంగా 39 కేసులు నమోదయ్యాయి. డెల్టా వేరియంట్‌ ప్రబలుతుండటంతో గడిచిన వారంలోనే వంద కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు.
 
మరోవైపు, రష్యాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,106 మంది మరణించారు. మహమ్మారి విజృంభించినప్పటి నుంచి ఒక్కరోజులో నమోదైన మరణాల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,32,775కు చేరింది. కొత్తగా 36,446 కేసులు నమోదయ్యాయి. 
 
వైరస్‌ కట్టడిలో భాగంగా అక్టోబర్‌ 30-నవంబర్‌ 7 వరకు ప్రభుత్వం వేతనంలో కూడిన సెలవులను ప్రకటించింది. అన్ని స్కూళ్లు, మాల్స్‌, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలను మూసివేయాలని ఆదేశించింది. వ్యాక్సిన్‌ వేసుకోని 60 ఏండ్లు పైబడిన వారు ఇండ్లకే పరిమితమవ్వాలని సూచించింది. ఉక్రెయిన్‌లో కూడా రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి.