గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (11:08 IST)

కరోనా దెబ్బకు డ్రాగన్ కంట్రీ కుదేలు.. రోజుకు 40 వేలకు పైమాటే..

pneumonia after corona
కరోనా వైరస్ వ్యాప్తికి డ్రాగన్ కంట్రీ చైనా బెంబేలెత్తిపోతోంది. ఈ వైరస్ వ్యాప్తికి ఇప్పటికే పలు నగరాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు చైనాలో రోజు వారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య 40 వేలకు పైమాటగానే ఉంది. దీంతో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కరోనా ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేసేందుకు నడుంబిగించారు. 
 
నిజానికి చైనాలో నానాటికీ పెరిగిపోతున్న కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఆ దేశ పాలకులు అమలు చేస్తున్న జీరో కోవిడ్ పాలసీ ఏమాత్రం ఫలితమివ్వడం లేదు. కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటంతో చాలా మంది ఆకలితో అలమటిస్తూ చనిపోతున్నారు. అందువల్ల కరోనా ఆంక్షలు తొలగించాలని బీజింగ్, షాంఘై, షింజియాంగ్ తదితర నగరాల్లో చైనీయులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, ఆదివారం చైనాలో 40,347 కరోనా కేసులు నమోదయ్యాయని చైనా నేషనల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ అధికారులు తెలిపారు. ఇందులో 3,822 మంది బాధితుల్లో వైరస్ లక్షణాలు కనిపించగా మిగిలిన 36,525 మందిలో లక్షణాలు కనిపించలేదని వైద్యులు తెలిపారు. 
 
అదేసమయంలో వైరస్ కారణంగా ఏ ఒక్కరూ కూడా చనిపోలేదని వివరించారు. జీరో కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా జనం చేస్తున్న ఆందోళనల వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా పెద్ద సంఖ్యలో జన గుమికూడటం వల్లే దేశంలో వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.