బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2020 (19:47 IST)

దాయాది దేశానికి పాకిన కరోనా.. కరాచీలో రెండు కేసులు (video)

దాయాది దేశమైన పాకిస్థాన్‌కు కరోనా పాకింది. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కొవిడ్-19 ప్రస్తుతం పాకిస్థాన్‌కు కూడా వచ్చింది. ఇస్లామాబాద్, కరాచీ నగరాల్లో రెండు కరోనా కేసులు నమోదైనట్లు పాక్ వైద్య అధికారులు ధ్రువీకరించారు. దీంతో దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. సింధ్, బలూచిస్తాన్‌లో విద్యాలయాలన్నీ మూతపడ్డాయి. 
 
కాగా ఇరాన్ నుంచి తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు చేసిన పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలిందని ప్రకటించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక వైద్య పర్యవేక్షకుడైన డాక్టర్ జాఫర్ మీర్జా ఈ కేసులను నిర్ధారించారు. కరోనా సోకిన వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని... ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ మీర్జా చెప్పారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే వున్నాయని తెలిపారు.  
 
కరాచీకి చెందిన సయ్యద్ ముహమ్మద్ యహ్యా జాఫ్రీ (22), గిల్గిత్ బాల్టిస్థాన్ కు చెందిన మరో వ్యక్తి (50)కి కరోనా సోకింది. గత వారంలో ఇరాన్ నుంచి కరాచీకి విమానంలో జాఫ్రీ తిరిగొచ్చాడు. అతనికి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, అతనితో పాటు అతని కుటుంబసభ్యులందరినీ దిగ్బంధించారు.
 
జాఫ్రీతో పాటు విమానంలో కరాచీకి వచ్చిన ప్రయాణికులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు పౌరులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో పాక్‌లో కలకలం మొదలైంది. కరోనా కేసులు రెండు మాత్రమే బయటపడ్డాయని ఆ దేశ సర్కారు ప్రకటించింది. దీంతో మాస్కులకు, మందుల ధరలకు రెక్కలొచ్చాయి.