పుతిన్ నిర్ణయంపై భారత్ ఆందోళన... 20 వేల మందికి పైగా విద్యార్థులు?
అమెరికాపై రష్యా అధినేత పుతిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రష్యాను బలహీనపర్చే చర్యలకు అమెరికా దిగుతోందని పుతిన్ ఆరోపించారు. రష్యాపై దాడి చేయించేందుకు ఉక్రెయిన్‌ను పావుగా వాడుకుంటుందని అన్నారు.
ఉక్రెయిన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని.. ఏ సమయంలోనేనా దాడి చేసే ప్రమాదం ఉందని తెలిపారు. నాటో హెడ్ క్వార్టర్స్ నుంచి ఉక్రెయిన్ ఆర్మీకి ఆదేశాలు అందుతున్నాయన్నారు. తమపై దాడికి వస్తే తిప్పికొడతామని హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.
మరోవైపు పుతిన్ నిర్ణయంపై ఉక్రెయిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు రష్యా దూకుడును అడ్డుకోవాలని కోరింది. తాము ఎవరికీ భయపడమని ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. మాస్కో శాంతి చర్చలను ధ్వంసం చేశారని.. ప్రాదేశిక రాయితీలు ఇవ్వకూడదని జెలెన్స్కీ ఆరోపించారు.
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశం అయ్యింది. సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భద్రతామండలిలో భారత శాశ్వాత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి అన్నారు. సంయమనం పాటించాలని ఇరుదేశాలకు సూచించారు.
ఉక్రెయిన్‌లో సుమారు 20 వేల మందికి పైగా ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారని, వారి భద్రత తమకు టాప్ ప్రయారిటీ అని తెలిపారు.