1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (11:54 IST)

కెనడాలో రోడ్డునపడిన భారతీయ విద్యార్థులు.. ఎందుకు?

కెనడా దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. అనేక మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కెనడాలోని క్యూబెక్‌లోని మూడు కాలేజీలను మూసివేశారు. దీంతో ఈ కాలేజీల్లో చదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కెనడా, అట్టావాలోని భారతీయ హైకమిషన్ కార్యాలయం స్పందించింది. భారతీయ విద్యార్థుల కోసం హైకమిషన్ ఒక అడ్వైజరీ జారీచేసింది. అలాగే, కెనడా ప్రభుత్వ ప్రతినిధులతో హైకమిషన్ సిబ్బంది చర్చలు జరుపుతుంది. 
 
మాంట్రియాల్‌లోని ఎం కాలేజీ, షబ్రుక్‌లోని సీడీఈ కాలేజీ, లాంగ్యుయెల్‌లోని సీసీఎస్జీ కాలేజీలను మూసివేశారు. భారీ మొత్తాల్లో ట్యూషన్ ఫీజులు కట్టాలంటూ విద్యార్థులపై ఒత్తిడి చేసి, ఉన్నఫళంగా ఈ విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ మూడు కాలేజీలు రైజింగ్ ఫీనిక్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ నిర్వహణలో ఉన్నాయి. 
 
పైగా, ఈ సంస్థ పలు బ్యాంకులను మోసం చేసినట్టు గుర్తించారు. మరోవైపు, భారతీయ విద్యార్థులకు హైకమిషన్ అధికారులు కీలక సూచనలు చేశారు. విద్యార్థులు ఎవరికీ చెల్లింపులు చేయొద్దని కోరారు. డబ్బులిస్తే విద్యార్థి వీసాలు సమకూర్చుతామని చెప్పే అనధికార వ్యక్తులను అస్సలు నమ్మొద్దని, వారితో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని కోరింది.