1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (21:55 IST)

హిజాబ్ : ప‌రీక్ష‌ల‌ను బ‌హిష్క‌రించిన విద్యార్ధులు.. ఎక్కడ?

హిజాబ్ వ్యవహారంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేప‌థ్యంలో కర్నాట‌క‌లో మూత‌ప‌డిన విద్యాసంస్థ‌లు సోమ‌వారం నుంచి తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే అత్యధిక ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించకుండా తరగతులకు హాజరైనప్పటికీ, శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 13 మంది విద్యార్థులు పదవ ప్రిపరేటరీ పరీక్షకు హిజాబ్ తొల‌గించి.. హాజరు కావడానికి నిరాకరించారు. ప‌రీక్ష‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్నామ‌ని పేర్కొన్నారు. 
 
మొగ్గ జిల్లాలోని ప్రభుత్వ పబ్లిక్ స్కూల్‌లో విద్యార్థులను ఉపాధ్యాయులు అడ్డుకుని హిజాబ్‌ను తొలగించాలని కోరారు. అయితే విద్యార్థులు హిజాబ్‌ను తీసివేయ‌డానికి పూర్తిగా నిరాకరించారు. తమను పరీక్షలు రాయడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. 
 
హిజాబ్ లేకుండా ప్రత్యేక గదిలో పరీక్షలు రాయమని టీచర్లు, స్కూల్ యాజమాన్యం వారిని ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే, విద్యార్థులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. పరీక్షల‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అక్కడి పాఠశాలకు చేరుకున్న బాలికల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అండగా ఉండి హిజాబ్  లేకుండా తరగతులకు హాజరుకాలేమని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు.