ఉగ్రవాదులకు పెన్షన్ ఇస్తున్న పాకిస్థాన్ : భారత్
ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన జాబితాలో అల్‌ఖైదా జాబితాలో ఉన్న ఉగ్రవాదులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక దేశం పాకిస్థాన్ అంటూ భారత్ ఐక్యరాజ్య సమితి వేదికగా పేర్కొంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్‌పై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విషం చిమ్మిన విషయం తెల్సిందే. ఇమ్రాన్ వ్యాఖ్యలకు ధీటుగా భారత్ స్పందించింది. అణు యద్ధమంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఓ దౌత్యవేత్తలాకాకుండా యుద్ధాన్ని రెచ్చగొట్టే వ్యక్తిలా మాట్లాడారంటూ భారత్ మండిపడింది.
ఇదే భారత విదేశాంగ మొదటి కార్యదర్శి విదిషా మైత్రా శనివారం స్పందిస్తూ, అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ తన వక్రబుద్ధిని మరోమారు బహిర్గతం చేశారంటూ ఆరోపించారు. పాక్ ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా మారింది వాస్తవం కాదా అని భారత్ ప్రశ్నించింది. తమ దేశానికి ఉగ్రసంస్థలతో ఎలాంటి సంబంధం లేదని పాక్ నిరూపించగలదా అంటూ సవాల్ చేసింది.
అంతేకాక పాక్ ప్రధాని ప్రసంగం విభజనను, విభేదాలను పెంచేలా, ద్వేషాన్ని రెచ్చగొట్టెలా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ తన ప్రసంగంలో పేర్కొన్న రక్తపాతం, హింసాకాండ, జాతిఆధిపత్యం, తుపాకీని తీయడం వంటి మాటలు 21వ శతాబ్దపు ఆలోచనలను కాకుండా మధ్యయుగపు నియంతృత్వ భావాలను ప్రతిబింభించేలా ఉన్నాయన్నారు.
ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలోని అల్ ఖైదా ఉగ్రవాదికి పెన్షన్ అందించే ఏకైక దేశం పాకిస్థాన్ అన్నారు. దీన్ని ఆ దేశం అంగీకరిస్తుందా లేదా అని మైత్రా ప్రశ్నించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేయకపోతే.. న్యూయార్క్‌లోని హబీబ్ బ్యాంకును ఎందుకు మూసివేయాల్సి వచ్చిందో పాకిస్థాన్ వివరించగలదా.. ఎఫ్‌ఏటీఎఫ్ ఎందుకు పాక్‌ను నోటీసులో పెట్టిందో ప్రపంచ దేశాలకు తెలపగలదా?
ఒసామా బిన్ లాడెన్‌కు పాక్ బహిరంగ రక్షకుడని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించగలరా? ఐక్యరాజ్య సమితి ప్రకటించిన జాబితాలోని 135 మంది ఉగ్రవాదులకు, 25 ఉగ్ర సంస్థలకు ఆ దేశం ఆశ్రయం ఇవ్వడం నిజం కాదా? యూఎన్ విడుదల చేసిన జాబితాలోని అల్ ఖయిదా ఉగ్రవాదికి పాక్ పెన్షన్ ఇవ్వడం వాస్తవం కాదా? ఆమె ప్రశ్నించారు.