గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 అక్టోబరు 2021 (13:05 IST)

బైడెన్ కొలువులో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొలువులో భారత సంతతికి చెందిన వ్యక్తికి మరో కీలక పదవి వరించింది. ఇప్పటికే అనేక మంది భారత సంతతికి చెందిన వ్యక్తులు కీలక పదవుల్లో కొలువుదీరివున్నారు. ఇపుడు మరో వ్యక్తికి కీలక పదవి వరించింది. 
 
అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్‌లో ఓ కీలక పదవికి అధ్యక్షుడు జో బైడెన్‌ భారత సంతతి వ్యక్తి పేరును ప్రతిపాదించారు. గతంలో అమెరికా వాయుసేనలో పనిచేసిన రవి చౌదరి అనే వ్యక్తి పెంటగాన్‌లోని ‘ఎయిర్‌ఫోర్స్‌ ఫర్‌ ఇన్‌స్టల్లేషన్స్‌ అండ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌’ విభాగానికి అసిస్టెంట్‌ సెక్రటరీ హోదాకు అర్హుడని బైడెన్‌ తెలిపారు. 
 
బైడెన్‌ ప్రతిపాదనకు సెనేట్‌ ఆమోదం లభిస్తే.. రవి చౌదరి ఆ పదవి చేపట్టనున్నారు. కాగా, రవి చౌదరి గతంలో ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ)లో అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్స్‌ ఇన్నోవేషన్‌ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేశారు. 
 
ఈ హోదాలో ఎఫ్‌ఏఏ వాణిజ్య అంతరిక్ష ప్రయాణాలపై జరుగుతున్న పరిశోధనలకు నేతృత్వం వహించారు. 1993-2015 వరకు వాయుసేనలో వివిధ హోదాల్లో పనిచేశారు. సీ-17 యుద్ధ విమాన పైలట్‌ అయిన రవి.. అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌లో కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. 
 
వ్యోమగాముల భద్రత కోసం నాసాతోనూ కలిసి పనిచేశారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు ఒబామా హయాంలో ఏషియన్‌ అమెరికన్స్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌ కమిషన్‌కు సలహాదారుగా పనిచేశారు.