శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (16:00 IST)

కిమ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి.. స్వలింగ సంపర్కులకు ఉరిశిక్షలు

north korea president kim
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆగడాలు నానాటికీ మరింతగా హెచ్చుమీరిపోతున్నాయి. ఈ విషయాన్ని పొరుగుదేశమైన దక్షిణ కొరియా వెల్లడించింది. ముఖ్యంగా, స్వలింగ సంపర్కులను, గర్భిణిలను కూడా ఉరితీస్తున్నారని ఆరోపించింది. సాధారణంగా ఉత్తర కొరియాలో ఆటవికపాలన సాగుతుందంటూ పలు ప్రపంచ దేశాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ఇక్కడ చిన్నచిన్న నేరాలకే కఠినమైన శిక్షలు విధిస్తుంటారు. ఆ శిక్షలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
 
తాజాగా దీనిపై పొరుగు దేశం దక్షిణ కొరియా సంచలన ఆరోపణలు చేసింది. కిమ్‌ ఆగడాలు మితిమీరుతున్నాయని ఆరోపించింది. చిన్నారులను, గర్భిణులను ఉరితీస్తూ ఆ దేశం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు దక్షిణకొరియా యునిఫికేషన్ మినిస్ట్రీ గురువారం 450 పేజీల నివేదికను వెలువరిచింది. ఈ శాఖ కొరియా దేశాల మధ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.
 
ఉత్తర కొరియా ప్రజల జీవించే హక్కు పెనుప్రమాదంలో ఉందని, చట్టంలో లేని, మరణశిక్షకు అనర్హమైన కేసులకు సైతం ఉరిశిక్షలు విధిస్తున్నారని ఆరోపించింది. మతపరమైన కార్యకలాపాలకు యత్నించడం, మూఢనమ్మకాలు, డ్రగ్స్‌ వినియోగించడం, దక్షిణకొరియాకు చెందిన వీడియోలను వీక్షించడం వంటి వాటిని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తూ మరణ దండన విధిస్తున్నారని పేర్కొంది. 
 
కిమ్‌ రాజ్యంలో కఠిన నిబంధనలను భరించలేక 2017 నుంచి 2022 మధ్య ఇతర దేశాలకు వలస వెళ్లిన 500 మంది ఉత్తర కొరియన్లను విచారించి దక్షిణ కొరియా ఈ నివేదిక తయారుచేసింది. దివంగత కిమ్‌ 2 సంగ్ చిత్రపటాన్ని చూపిస్తూ ఓ మహిళ నృత్యం చేసిన వీడియో వైరల్‌ అయింది. దీన్ని నేరంగా పరిగణిస్తూ ఆరు నెలల గర్భిణీగా ఉన్న ఆ మహిళను బహిరంగంగా ఉరితీసిందని ఆ నివేదిక ఆరోపించింది. 
 
కాంగ్వాన్‌ ప్రావిన్స్‌, వాన్సన్‌ నగరంలోని ఓ స్టేడియంలో ఆరుగురు యువకులు ధూమపానం చేస్తూ దక్షిణకొరియాకు సంబంధించిన వీడియోను చూస్తున్నారని వారిపై నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపారని వివరించింది. స్వలింగ సంపర్కులు, కొన్ని మతాల వారు, విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన వారికీ ఉరిశిక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది. వ్యక్తులకు రహస్యంగా నిద్రమాత్రలిచ్చి వారిని బలవంతంగా ఆసుపత్రుల్లో చేర్చి వారిపై వివిధ రకాల ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపణలు చేసింది.