సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (10:31 IST)

పాకిస్థాన్ ఎన్నికలు : ఇమ్రాన్ పార్టీ లీడింగ్.. నవాజ్ షరీఫ్‌కు సైన్యం వెన్నుదన్ను

imran khan
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఆ దేశ క్రికెట్ లెంజెడ్ ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీ ఆధిపత్యంలో కొనసాగుతుంది. అయితే, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పాకిస్థాన్ సైన్యం వెన్నుదన్నుగా నిలుస్తుంది. దీంతో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. 
 
మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ - నవాజ్‌ పార్టీ ఉంది. ఈ పార్టీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ కంటే ఎన్నికల్లో వెనుకబడివుంది. అయితే, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతుంది. ఈ చర్చల్లో పురోగతి సాధించినట్లు కనిపిస్తోంది. పీపీపీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ, అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతో తమ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ ఆదివారం జరిపిన చర్చల్లో చాలా అంశాలపై సఖ్యత కుదిరినట్లు పీఎంఎల్‌-ఎన్‌ ప్రకటించింది. 'రాజకీయ అనిశ్చితి నుంచి దేశాన్ని రక్షించేందుకు ఇరు పార్టీల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది' అని పేర్కొంది.
 
ఈ నేపథ్యంలో త్వరలోనే జరగబోయే సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో పీపీపీ నాయకత్వం వారి ప్రతిపాదనలను తమ ముందు ఉంచుతుందని పీఎంఎల్‌-ఎన్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. యావత్‌ దేశ పరిస్థితిని సమీక్షించి.. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అలాగే భవిష్యత్‌లో రాజకీయ సహకారంపైనా వివరంగా చర్చించినట్లు వెల్లడించింది. ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు తమ పక్షానే నిలిచారని చెప్పుకొచ్చింది. పీఎంఎల్‌-ఎన్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు పీపీపీ సైతం ధ్రువీకరించింది.
 
ఆదివారం పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఫలితాల ప్రకారం, 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్‌-ఎన్‌కు 75 దక్కాయి. ఇమ్రాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు సాధించారు. పీఎంఎల్‌-ఎన్‌ అధికారంలోకి రావాలంటే 54 సీట్లలో విజయం సాధించిన పీపీపీ మద్దతు తప్పనిసరి. రెండు పార్టీలు కలిస్తే 129 సీట్లు అవుతాయి. 17 సీట్లు నెగ్గిన ఎంక్యూఎం-పీతోనూ నవాజ్‌ షరీఫ్‌ చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు అవసరం. ఈ మూడు పార్టీలు కలిస్తే అధికారం సొంతమవుతుంది. ఈ పొత్తుకు ఇంకా ఎంక్యూఎం-పీ పచ్చజెండా ఊపలేదు.