శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 మే 2024 (16:50 IST)

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

srilanka tourism
తమ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా శ్రీలంక దేశం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు వీసా ఫ్రీ వెసులుబాటు కల్పించింది. ఈ తరహా వెసులుబాటు కల్పించిన దేశాల్లో భారత్‌తో పాటు చైనా, రష్యా, జపాన్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాలు ఉన్నాయి. తమ దేశానికి 30 రోజుల పర్యటనకు వచ్చేందుకు వీలుగా పలు దేశాలకు చెందిన పౌరులకు ఉచిత వీసా ప్రవేశాన్ని అందించాలని ఆ దేశ క్యాబినెట్ సోమవారం నిర్ణయించింది.
 
వీసా ఫ్రీ ఎంట్రీని నిర్వహించే ఇమ్మిగ్రేషన్ శాఖ ప్రకారం పైన పేర్కొన్న దేశాల నుండి విదేశీయులు శ్రీలంకకు చేరుకోవడానికి ముందు www.srilankaevisa.lk వెబ్‌సైట్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఉచిత వీసా అనేది 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. కాగా, కరోనా కారణంగా దేశంలో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని పునర్నిర్మించేందుకు పైలట్ ప్రాజెక్టుగా అక్టోబరులో ఈ ఉచిత వీసా పథకాన్ని శ్రీలంక ప్రారంభించింది.
 
ఇదిలావుంటే.. ఒక ప్రైవేట్ కంపెనీ కింద వివిధ వీసాలపై అధిక ఛార్జీలు విధించడంపై ఇటీవల వివాదం నెలకొన్న నేపథ్యంలో అరైవల్ వీసాపై దేశంలోకి ప్రవేశించే సందర్శకులకు 30 రోజుల పాటు 50 డాలర్ల ఫీజును కొనసాగించాలని శ్రీలంక మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వం నుండి వీసా జారీ ప్రక్రియను 100 డాలర్ల వరకు పెంచిన రుసుముతో ప్రైవేట్ కంపెనీకి మార్చడాన్ని పర్యాటక సంబంధిత పరిశ్రమలతో సహా అనేక వర్గాలు తప్పుపట్టాయి. ఇప్పుడిప్పుడే ఆర్థిక సంక్షోభం నుండి కోలుకుంటున్న దేశానికి పర్యాటకుల రాకపై అధిక రుసుము ప్రభావం చూపుతుందని పెదవి విరిచారు.