సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 22 నవంబరు 2023 (16:17 IST)

అండర్-19 ప్రపంచ కప్ వేదిక మారింది.. ఎందుకో తెలుసా?

icccricekt
అండర్-19 ప్రపంచ కప్ వేదికను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మార్చింది. తాజాగా భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో శ్రీలంక జట్టు ఘోర వైఫల్యం చెందిన విషయం తెల్సిందే. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డును శ్రీలంక దేశ క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. పైగా, క్రికెట్ బోర్డులో రాజకీయ, ప్రభుత్వ జోక్యం తమ నిబంధనలకు విరుద్ధమంటూ శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ కూడా సస్పెండ్ చేసింది. 
 
ఈ నేపథ్యంలో, శ్రీలంకలో జరగాల్సిన అండర్-19 వరల్డ్ కప్ వేదిక మారింది. అండర్-19 వరల్డ్ కప్‌ను శ్రీలంక నుంచి దక్షిణాఫ్రికాకు తరలిస్తున్నట్టు ఐసీసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. పురుషుల విభాగంలో 15వ అండర్-19 వరల్డ్ కప్ వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతుందని వెల్లడించింది. మంగళవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ సమావేశంలోనే అండర్-19 వేదిక మార్పు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ ఉన్నప్పటికీ... శ్రీలంక జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు, ఐసీసీ టోర్నీల్లో పాల్గొనవచ్చని ఊరట కలిగించే నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డుకు లభించే నిధులను ఇకపై ఐసీసీ నియంత్రిస్తుంది.