గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (10:28 IST)

వన్డే ప్రపంచ కప్ సెమీస్‌కు చేరాలంటే పాకిస్థాన్ ఏం జరగాలో తెలుసా?

pakistan team
భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, చివర లీగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే, ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌లో సెమీస్‌కు చేరే జట్లు ఖరారైపోయాయి. అయితే, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్లకు మాత్రం ఎక్కడో కారడవిలో చిరు దీపంలా ఓ చిన్నపాటి ఆశ మిగిలివుంది. ముఖ్యంగా, పాకిస్థాన్ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టాలంటే మహాద్భతమే జరగాల్సివుంది. దీనికి కారణం గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు విజయభేరీ మోగించడమే. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో పాకిస్థాన్ ఏకంగా 287 పరుగులు లేదా 384 బంతులు మిగిలివుండగానే గెలుపొందితే మాత్రం సెమీస్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి. లేనిపక్షంలో శ్రీలంక, ఇంగ్లండ్, ఆప్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ జట్లతో పాటు పాకిస్థాన్ కూడా స్వదేశానికి బయలుదేరాల్సివుంటుంది. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు చేరాలంటే మహాద్భుతమే జరగాల్సివుంది. ఆ జట్టు సంచలనం కాదు అంతకుమించిన విజయాన్ని అందుకోవాలి. లంకపై గెలుపుతో కివీస్ 9 మ్యాచ్ 5 విజయాలు, 10 పాయింట్లతో ఉంది. ఇప్పుడా జట్టు నెట్ రన్‌రేట్ 0.743. 8 మ్యాచ్‌లలో 4 విజయాలు, 8 పాయింట్లు, 0.036 రన్‌రేట్‌తో ఉన్న పాకిస్థాన్ తన చివరి మ్యాచ్‌లో శనివారం ఇంగ్లండ్ తలపడనుంది. 
 
ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే 10 పాయింట్లు ఖాతాలో చేరతాయి. కానీ కివీస్ నెట్ రన్‌రేట్ దాటాలంటే కేవలం విజయం సరిపోదు. పాక్ కనీసం 287 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించాల్సివుంది. కానీ, సాధమయ్యే పనికాదు. ఇప్పటివరకు ఆ జట్టు అతిపెద్ద విజయం 2016లో ఐర్లాండ్‌పై సాధించింది. 255 పరుగుల తేడాతో గెలిచింది. ఒకవేళ మ్యాచ్‌లో మొదట ఇంగ్లండ్ 150 పరుగులకే పరిమితమైనా.. ఆ లక్ష్యాన్ని పాక్ కేవలం 3.4 ఓవర్లలోనే అందుకోవాలి. 
 
కానీ ఇలా జరగడం అసాధ్యం కాబట్టి పాక్ కథ ముగిసిందనే చెప్పాలి. అలాగే, శుక్రవారం సౌతాఫ్రికా, ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. అయితే, -0.338 రన్‌రేట్‌తో ఉన్న ఆప్ఘనిస్థాన్ సెమీస్ చేరాలంటే శుక్రవారం తమ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై కనీసం 438 పరుగుల తేడాతో గెలవాలి. ఇది అంత సులభమైన విషయం కాదు.