ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 జూన్ 2023 (13:58 IST)

టైటానిక్‌ శకలాలను చూసేందుకు వెళ్లిన బిలియనీర్‌ గల్లంతు

submerine
ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలోని జలగర్భంలో నిక్షిప్తమైన టైటానిక్‌ మహానౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ మినీ జలాంతర్గామి ఆచూకీ గల్లంతైంది. ఇందులో యూఏఈలో నివసించే బ్రిటన్‌కు చెందిన బిలియనీర్‌ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంతో అమెరికా, కెనడా రక్షణ బృందాలు అప్రమత్తమయ్యాయి. 22 అడుగుల పొడవున్న ఆ మినీ జలాంతర్గామి ఆచూకీ కనుగొనేందుకు ఇరు దేశాల కోస్ట్‌గార్డ్‌ బృందాలు కొన్ని వందల చదరపు కిలోమీటర్లలో గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు 13,000 అడుగుల లోతున్న చోట ఆ మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను జారవిడిచారు.
 
ఈ మునిగిపోయిన జలాంతర్గామిలో మొత్తం ఐదుగురు ఉన్నట్లు రియర్‌ అడ్మిరల్‌ జాన్‌ ముగెర్‌ పేర్కొన్నారు. వారెవరనేది ఇంకా ఖచ్చితంగా గుర్తించలేదని పేర్కొన్నారు. అందులో ఉన్న వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. వారు యాత్రను మొదలుపెట్టిన 1.45 గంటల్లో కమ్యూనికేషన్‌ను కోల్పోయారని అమెరికా కోస్ట్‌గార్డ్‌ బృందం పేర్కొంది. 
 
పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలోకి దించారు. వాణిజ్య నౌకలను కూడా గాలింపులో భాగస్వాములను చేశారు. మునిగిన ఆ జలాంతర్గామిలో ఇంకా 72 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ ఉన్నట్లు సమాచారం. 10,432 కిలోల బరువున్న జలాంతర్గామి 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. 
 
ఈ మునిగిపోయిన మినీ జలాంతర్గామిలో బ్రిటన్‌కు చెందిన బిలియనీర్‌ హమీష్‌ హార్డింగ్‌ (58) కూడా ఉన్నట్లు ఆయన కంపెనీ యాక్షన్‌ ఏవియేషన్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు ఆధారంగా తెలుస్తోంది. 'జలాంతర్గామి ఇప్పుడే బయల్దేరింది.. హమీష్‌ విజయవంతంగా డైవింగ్‌ చేస్తున్నారు' అని దానిలో వెల్లడించింది.