శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (15:50 IST)

హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు బైడెన్ శుభవార్త

వేలాది మంది భారతీయ వలసదారులకు ప్రయోజనం కలిగించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ‘ఆటోమేటిక్‌ వర్క్‌ ఆథరైజేషన్‌’ కింద అనుమతులు ఇచ్చేందుకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సర్కారు సమ్మతించింది. 
 
ఈ అంశంపై వలసదారుల జీవిత భాగస్వాముల తరపున అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌(ఏఐఎల్‌ఏ) వేసిన పిటిషన్‌పై అక్కడి హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ సానుకూలంగా స్పందించింది. 
 
నిజానికి అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్‌-4 వీసాలు జారీ చేస్తుంటారు. అయితే, హెచ్‌-4 వీసాదారుల ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్‌ పత్రాల పొడగింపు కోసం తరచూ రెగ్యులేటరీ పరీక్షలు నిర్వహిస్తుంటారు. 
 
కానీ, గతంలో హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్‌-4 వీసాదారులు ఉద్యోగాలు పొందకుండా నిషేధం విధించడంతో వారు రీ-ఆథరైజేషన్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో ఎలాంటి చట్టబద్ధమైన కారణాలు లేకుండా వీరు అత్యధిక వేతనాలు పొందే ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. 
 
దీనిపై వలసదారుల జీవిత భాగస్వాములు ఏఐఎల్‌ఏను ఆశ్రయించగా.. వారు హోంల్యాండ్‌ సెక్యూరిటీస్‌ విభాగంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా బైడెన్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 
 
దీంతో హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు ఇకపై తమ ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ పొడగింపు కోసం ఎదురుచూడకుండా ఆటోమెటిక్‌గా పని అనుమతులు పొందనున్నారు.