కార్ రేసర్‌గా మూడుసార్లు జాతీయ అవార్డులు దక్కించుకున్న శైలేష్ బొలిశెట్టి సినిమా రంగంలోకి అనుకోకుండా అడుగుపెట్టారు. 'ముకుంద'లో చిన్న పాత్ర వేసే అవకాశం కల్గిన ఆయనకు రెండో సినిమా 'చల్ చల్ గుర్రం'లో హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్‌ను పవన్ కళ్యాణ్ చూడటం చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈనెల 28న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆయనతో చిట్‌చాట్.
* మీ నేపథ్యం?
మాది విశాఖపట్నం. నాన్న ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేస్తుంటాడు. నన్ను చూసుకోమనేవారు. చిన్నతనం నుంచి రేసింగ్ అంటే ఇష్టం. అందుకే కొద్దికాలం వ్యాపారం చూశాక రేసింగ్‌లోకి వెళ్ళాను. అలా మూడుసార్లు నేషనల్ లెవల్ ఛాంపియన్‌ని కూడా. యు.కె., యూరప్‌లోకూడా పాల్గొన్నాను.
* సినిమాలోకి ఎలా రావాలనిపించింది?
అనుకోకుండా వచ్చేశాను. కార్‌రేసర్‌గా టీవీ ముందు ఇంటర్వ్యూ ఇస్తుంటే సరిగ్గా కెమెరాకు ఫేస్ చేయలేకపోయాను. అందుకే నాన్న వైజాగ్ సత్యానంద్ దగ్గర కెమెరాకు ఫేస్ ఎలా చేయాలో నేర్చుకోమన్నారు. నేను సినిమాల కోసం రాలేదని ఆయనకు తెలుసు. అలా కొద్దిరోజుల ట్రైనింగ్ చేస్తుండగా.. ఓసారి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల వచ్చారు. 'ముకుందా' సినిమాలో ఓ పాత్ర కోసం కొత్త వారిని వెతుకుతున్నారు. అప్పుడు సత్యానంద్ నన్ను ప్రిఫర్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల కూడా వెంటనే తీసుకున్నారు.
* 'ముకుందా' తరువాత చాలా గ్యాప్ తీసుకున్నారే?
ఆ సినిమా తర్వాత నాన్నగారి వ్యాపారాన్ని చూసుకున్నాను. అలా కొద్దికాలం గడిచిపోయింది. ఆ తర్వాత కార్‌రేసింగ్‌కు వెళ్ళాను. అందుకే గ్యాప్ వచ్చింది.
* మరి రేసింగ్‌ను వదిలేశారా?
వదల్లేదు. కానీ ఇంతకుమునుపు రేసింగ్, బిజినెస్, సినిమా అన్నీ ఒకేసారి చేసేటప్పటికి ఏదీ కరెక్ట్‌గా చేయలేకపోయాను. దీంతో సమయం పూర్తిగా ఏదైనా ఒకదాని మీద కేటాయిద్దామని సినిమా ఎంచుకున్నాను.
* పవన్ కళ్యాణ్‌ను ఎలా కలిశారు?
ఈ చిత్ర నిర్మాత రాఘవయ్య 'జనసేన' పార్టీ కోశాధికారిగా ఉండేవారు. ఆయన పార్టీ పని మీద వెళుతూ నన్ను తీసుకెళ్ళారు. పార్టీ విషయాలు ప్రస్తావిస్తూ.. మధ్యలో సినిమా గురించి చెబుతూ నన్ను చూపించారు. ఆయన 'కాటమరాయుడు' గెటప్‌లో ఉన్నారు. ఆ గెటప్ బయటకు రావడం ఇష్టంలేక.. డ్రెస్ మార్చుకుని వచ్చి మా కోసం 10 నిముషాలు టైం కేటాయించి ట్రైలర్ చూసి, పాటలు విన్నారు చాలా హ్యాపీగా ఫీలయ్యాను.
* సినిమా కథేమిటి?
ఒకే రోజు రెండు ఉద్యోగాలు చేసే కుర్రాడి కథ. రెండు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఒకే బిల్డింగ్‌లో కిందా, పైనా ఉండటంతో రెండు ఉద్యోగాలు చేస్తుంటాడు. అలా ఒకేరోజు రెండు చోట్ల ఎలా జాబ్ చేశాడు. అసలేందుకు అలా చేశాడనేదే ఈ సినిమా కథ.
* టైటిల్‌కు సంబంధం ఏమిటి?
గుర్రం ఎలాగైతే పరుగెడుతుందో అలా నేను ఒక ఉద్యోగం అయ్యాక వెంటనే మరో ఉద్యోగం కోసం పరుగెడతాను. అందుకే టైటిల్‌ను దర్శకుడు మోహన్ ప్రసాద్ పెట్టారు. ఇదంతా చాలా కామెడీగా వుంటుంది.
* మరి కామెడీ బాగా పండించారా?
కామెడీనే కాదు డాన్స్ కూడా కష్టమే. ఏదోలా ఇందులో మేనేజ్ చేశాను.
* రేసింగ్ ఈజీనా నటన ఈజీనా?
రేసింగ్ చాలా ఈజీ.. నటన చాలా కష్టం.
* మరి నటుడిగా కొనసాగుతారా?
అవకాశాలు వచ్చినప్పుడల్లా నటిస్తాను. ఇప్పటికే రెండు సినిమాల్లో నెగెటివ్ రోల్స్ వచ్చాయి. కానీ హీరోగానే చెయ్యాలని ఉంటుంది కదా. నేనూ అంతే సపోర్టింగ్ రోల్స్ గురించి ఇంకా ఆలోచించలేదు.
* రేసర్ కథతో సినిమా చేయవచ్చుకదా?
అలాంటివి ఇక్కడ చేయడం కష్టం. ఇప్పటికే 'ఫాస్టర్ ఆఫ్ ఫ్యూరిస్' వంటి చిత్రాలు అద్భుతంగా ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయి. అంతకంటే ఎక్కువగా తీయాలి.
* సినిమాలు రేసింగ్ కొనసాగిస్తారా?
అటు సినిమాలు, ఇటు బిజినెస్, మధ్య మధ్యలో రేసింగ్ ఇలా మూడింటినీ బ్యాలెన్స్ చేసుకుంటాను.