సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ఇస్లాం
Written By chj
Last Modified: శుక్రవారం, 25 మే 2018 (22:25 IST)

పేదలు పండగ చేస్కుంటున్నారు... జూన్ 1 నుంచి 12 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా

అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో నవ్యాంధ్ర పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటుతో ప్రస్థానం ప్రారంభించిన కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పథం పట్టించడంలో సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో

అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో నవ్యాంధ్ర పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటుతో ప్రస్థానం ప్రారంభించిన కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పథం పట్టించడంలో సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తూనే మరోవైపు అన్నపూర్ణగా పేరుగాంచిన ఏపీలో వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. కేవలం అభివృద్ధితోనే సరిపెట్టకుండా పేదల సంక్షేమానికీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, ఏటా లక్షల కోట్ల రూపాయాలను వెచ్చిస్తోంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పేదలకు పౌష్టికాహారం అందజేయడం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇప్పటికే తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై నిత్యావసర సరకులు పంపిణీ చేస్తోంది. 
 
అయితే, పండగ నాడూ పేదలు మరింత ఆనందంగా ఉండాలనేది ప్రభుత్వ అభిమతం. ఇందుకుగానూ చంద్రన్న కానుకల పేరుతో పేదలకు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తోంది. సర్వమత సమానతను పాటిస్తూ, క్రిస్మస్, సంక్రాంతి పండగలకు తెలుపు రంగు రేషన్ కార్డుదారులకు ఈ సరుకులను అందజేస్తోంది.  ఇందుకోసం నాలుగేళ్ల నుంచి చంద్రన్న కానుకల పేరుతో ఆరు రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తోంది. చందన్న కానుకల పేరుతో అందజేసే కిట్ లో నెయ్యి 100 గ్రాములు, పామాయిల్ అర లీటరు, కిలో గోధుమ పిండి, అరకేజి కందిపప్పు, అరకేజి శనగపప్పు, బెల్లం అరకేజీ ఉంటున్న విషయం తెలిసిందే. రంజాన్ తోఫా పేరుతో అందజేసే కిట్ లో నాలుగు రకాల నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. 
రూ.17ల విలువ చేసే కిట్‌లో 5 కేజీల గోధుమ పిండి, 2 కేజీల పంచదార, కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి ఉంటున్నాయి. చంద్రన్న కానుకల వల్ల రాష్ట్రంలో ఉన్న కోటీ 40 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి వరకూ ప్రభుత్వం రూ. 1,415.11 కోట్ల విలువ చేసే చంద్రన్న కానుకలను నిరుపేదలకు అందించింది. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫాను అందజేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకుగానూ మరో రూ.35.29 కోట్లు ఖర్చుచేయనుంది. ధనికులతో పాటు పేదలు కూడా పండగలు ఘనంగా జరుపుకోవాలనే ఉన్నతమైన ఆశయంతో చంద్రబాబునాయుడు ప్రభుత్వం రూ.1,451.11 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులను ఉచితంగా పేదలకు అందజేసింది. 
 
పేదల ఇళ్లల్లో ఆనందమే లక్ష్యం...
ఇప్పటికీ ఎన్నో పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా సబ్సిడీపై ప్రభుత్వమందజేస్తున్న నిత్యావసర వస్తువులు ఆయా కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉంటున్నాయి. పండగ రోజుల్లోనూ పేద కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చంద్రన్నకానుకల పేరుతో తెల్ల రంగు రేషన్ కార్డు కలిగిన పేదలకు క్రిస్మస్, సంక్రాంతికి ఆరు రకాల నిత్యావసర వస్తువులు, రంజాన్ సందర్భంగా నాలుగు రకాల నిత్యావసర వస్తువులు  అందజేస్తోంది. వాటి ద్వారా పండగనాడు పిండివంటలు చేసుకునే సౌలభ్యం  పేదలకు కలుగుతుంది. గతంలో పండగనాడూ పస్తులు ఉండే పరిస్థితులుండేవి. చంద్రబాబు ప్రభుత్వ సదాశయంతో పేదలు పండగనాడూ పిల్లాపాపలతో కలిసి పిండివంటలతో పాటు కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నారు. 
 
నాలుగేళ్లలో రూ.1,451.11 కోట్ల చంద్రన్న కానుకలు...
2014 జూన్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన నవ్యాంధ్రను గాడిలో పెట్టిన చంద్రబాబునాయుడు 2015 నుంచి నిరుపేదలకు చంద్రన్న కానుకల పేరుతో ఏటా రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి పండగలకు ఆరు రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి 2018 సంక్రాంతి వరకూ  రూ.1,415.82 కోట్లు  విలువచేసే చంద్రన్న కానుకలను పేదలకు చంద్రబాబు ప్రభుత్వం అందజేసింది. 2015 లో సంక్రాంతి, క్రిస్మస్ లకు రూ.312.01 కోట్లు, అదే సంవత్సరం రంజాన్ తోఫా కోసం రూ.30.76 కోట్లను చంద్రన్న కానుకల కోసం ప్రభుత్వం వెచ్చించింది. 2016 సంక్రాంతి, క్రిస్మస్ లకు రూ.285.83 కోట్లు, రంజాన్ కోసం రూ.31.97 కోట్లు  వ్యయం చేసింది. 2017 సంక్రాంతి, క్రిస్మస్ లకు రూ.354.05 కోట్లు, రంజాన్ కోసం రూ.38.69 కోట్లు, 2018 సంక్రాంతి, క్రిస్మస్ కు రూ.362.61 కోట్లు ... ఇలా నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం చంద్రన్న కానుకల కోసం రూ.1,415 కోట్లు వెచ్చించింది. ఈ ఏడాది కూడా రంజాన్ సందర్భంగా ముస్లిములకు రూ.35.29 కోట్లతో రంజాన్ తోఫాఅందజేయనుంది. ఇలా 2015 నుంచి 2018 రంజాన్ వరకూ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,451.11 కోట్ల విలువైన చంద్రన్న కానుకలను పేదలకు ఉచితంగా అందజేసి పేదల లోగిళ్లలో పండగ సందడి తీసుకొచ్చింది.
 
జూన్ 1 నుంచి 12 లక్షల మందికి రంజాన్ తోఫా...
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ముస్లిము సోదరులకు రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా తోఫా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగానూ ప్రభుత్వం రూ.35.29 కోట్లు వెచ్చించనుంది. దీనివల్ల రాష్ట్రంలో తెలుగు రంగు రేషన్ కార్డులు కలిగిన 12 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగనుంది. రూ.17ల విలువ కలిగిన రంజాన్ తోఫా కిట్ లో నాలుగు రకాల నిత్యావసర వస్తువులు ఉంటాయి. 5 కేజీల గోధుమ పిండి, 2 కేజీల పంచదార, కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి ఉచితంగా అందజేయనున్నారు. ఈ నాలుగు రకాల వస్తువుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.488లు. పవిత్ర రంజాన్ సందర్భంగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం జూన్ ఒకటో తేదీ నుంచి రంజాన్ తోఫాను అందజేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే సరుకుల పంపిణీకి సంబంధించిన అన్ని చర్యలూ తీసుకుంది. ఆయా జిల్లాల్లో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లకు చంద్రన్న కానుకల కిట్లు చేరుకున్నాయి. జూన్ 1 తేదీ నుంచి రాష్ట్రంలో ఉన్న 27.666 రేషన్ డిపోల ద్వారా రంజాన్ తోఫా అందజేయనున్నారు. 
 
కొత్త కార్డులకూ రంజాన్ తోఫా...
ప్రస్తుతం రాష్ట్రంలో కోటీ 40 లక్షలా 81 వేలా 019 తెలుపు రంగు రేషన్ కార్డులున్నాయి. కొత్తగా తెలుపు రేషన్ కార్డులు కావాలంటూ లక్షల సంఖ్యలో దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వాటిలో లక్షా 90 వేల దరఖాస్తులు అర్హమైనవి గుర్తించి, వచ్చే జూన్ నెలలో వాటికి కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేయనుంది. ఈ లక్షా 90 వేల తెలుపు రంగు రేషన్ కార్డుల్లో ఉన్న ముస్లిము సోదరులకూ రంజాన్ తోఫా అందజేయాలని ప్రభుత్వంనిర్ణయించింది.
 
డీలర్లకూ పండగ బొనంజా...
కేవలం కార్డుదారులకే కాకుండా డీలర్లు కూడా సంతోషంగా పండగ జరుపుకునేలా ప్రభుత్వం తీపు కబురు అందించింది. గతంలో చంద్రన్న కానుకలు, రంజాన్ తోఫా పంపిణీ చేసేటప్పుడు డీలర్లకు రూ.5ల కమీషన్ అందజేసేది. మారుతున్న పరిస్థితులు, ధరలు నేపథ్యంలో వారికి అందజేసే కమీషన్ పెంచాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో అందజేసే కమీషన్ ను వంద శాతం పెంచింది. ప్రతి కార్డుకూ డీలర్లకు రూ.10లు అందజేయనుంది. ఈ పెంపుదల ఈ ఏడాది సంక్రాంతి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. 
 
సరకుల పంపిణీపై గట్టి నిఘా...
చంద్రన్న సరకులు పంపిణీ పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. కానుకల్లో నాణ్యత లోపం లేకుండా ఉండేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసింది. సరుకులు పక్కదారి పట్టినా, నాణ్యత లోపించినా 1100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కార్డుదారుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, సరుకుల నాణ్యతాలోపంతో ఎవరూ నష్టపోకూడాదనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు.