ఆ స్మార్ట్ ఫోన్ ధర రూ.500 కాదు.. రూ.250... సేఫ్టీయేనా?
భారత మొబైల్ మార్కెట్‌లోకి అత్యంతకారుచౌక ధరలో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధర రూ.500గా ఉంటుందని ప్రకటిస్తూ వచ్చారు. అయితే, తాజా సమాచారం మేరకు ఈ ఫోన్ ధర రూ.250 మాత్రమేనటి. దేశవాళీ సంస్థ రింగింగ్ బెల్స్ 'ఫ్రీడమ్ 251' పేరిట తయారు చేసిన ఈ ఫోన్‌ను భారత రక్షణ శాఖామంత్రి మనోహర్ పారీకర్ బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు.
పైగా, ప్రపంచంలోనే అత్యంత చౌక ధరకు లభించే స్మార్ట్ ఫోన్ ఇదే కావడం గమనార్హం. ఇందులోని ఫ్యూచర్లను ఓసారి పరిశీలిస్తే... 4 అంగుళాల టచ్ స్క్రీన్, 1 జిబీ రామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 3.2 ఎంపీ కెమెరా, 0.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1450 ఎంఏహెచ్ బ్యాటరీ, 3జీ, వైఫై 802.11, బ్లూటూత్, జీపీఎస్ సౌకర్యం కూడా ఉండే ఈ ఫోన్.. తెలుపు రంగులో లభ్యంకానుంది.
వాస్తవానికి 8 జీబీ మెమొరీ కార్డు లేదా 1450 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా రూ.251 ధరలో లభ్యం కావు. అటువంటిది ఈ ధరలో ఇన్ని సౌకర్యాలతో ఫోన్ నిజంగా భారత్ 'మేకిన్ ఇండియా' సాధించిన ఘనతగా బీజేపీ నేతలు చెపుతున్నారు. అయితే, ఫోన్ సేఫ్టీపై పలువురు టెక్నాలజీ నిపుణులు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.