1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 మే 2024 (16:44 IST)

స్మార్ట్ ఫోన్ యూజర్లను హెచ్చరించిన కేంద్రం

5g smart phones
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఓ హెచ్చరిక చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని లోపాల (ఫ్లాస్) కారణంగా మీ ఫోన్ హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు చాలా సులభంగా మీ ఫోన్‌ను తమ కంట్రోల్‌‌లోకి తీసుకోవచ్చని, ఫోనులోని మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని వెల్లడించింది. దీనిని అడ్డుకోవడానికి ఇండియన్ స్మార్ట్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అప్ డేట్ వెర్షన్‌ను రిలీజ్ చేసినట్లు తెలిపింది. వెంటనే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.
 
దేశంలో చాలావరకు స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే పని చేస్తున్నాయని సీఈఆర్టీ ఇన్ పేర్కొంది. ఇప్పటికీ పాత వెర్షన్‌లోనే ఉన్న స్మార్ట్ ఫోన్లలోకి హ్యాకర్లు సులభంగా ప్రవేశిస్తారని, యూజర్‌కు తెలియకుండానే అందులోని విలువైన సమాచారాన్ని తస్కరిస్తారని చెప్పింది. 
 
ఫొటోలు, యూపీఐ వివరాలు, ఇతరత్రా సమాచారం దొంగిలించవచ్చని వివరించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని పలు లోపాలను తాజాగా గుర్తించినట్లు తెలిపింది. ఇవి ఆండ్రాయిడ్ యూజర్ల ప్రైవసీకి ముప్పుగా పరిణమిస్తాయని చెప్పింది. అంతేకాదు, హానికరమైన సాఫ్ట్ వేర్‌ను మీ ఫోన్‌లో ఇన్ స్టాల్ చేసే అవకాశమూ లేకపోలేదని హెచ్చరించింది. 
 
కాగా, హ్యాకింగ్ ఉన్న ఫోన్ల వివరాలను పరిశీలిస్తే, ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12ఎల్, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14.. ఈ వెర్షన్లు వాడుతున్న స్మార్ట్ ఫోన్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, లేటెస్ట్ వెర్షన్‌తో ఫోన్‌ను అప్ డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ ఇన్ సూచన చేసింది.