మంగళవారం, 31 జనవరి 2023
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated: బుధవారం, 28 సెప్టెంబరు 2022 (16:34 IST)

లంచాలు ఇచ్చేందుకు రూ.188 కోట్ల నిధులు కేటాయింపు

currency notes
భారతదేశంలో తమ పనులు సక్రమంగా సాగే నిమిత్తం అధికారులకు లంచాలు ఇచ్చేందుకు ప్రముఖ టెక్ కంపెనీ ఒరాకిల్ ఏకంగా రూ.188 కోట్ల నిధులను కేటాయించింది. ఈ సంస్థ భారీగా అవకతవకలకు పాల్పడినట్టు అమెరికా సెక్యూరిటీస్ ఎక్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) గుర్తించింది. భారత్, యూఏఈ, టుర్కీ దేశాల్లో అధికారులకు లంచాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా 3.30 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.188 కోట్లు) కేటాయించినట్టు గుర్తించింది. ఇది విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం (ఎఫ్‌సీపీఏ) ఉల్లంఘనే అవుతుందని పేర్కొంది. 
 
ముఖ్యంగా ఒరాకిల్ ఇండియా విభాగం రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ఓ రవాణా సంస్థకు భారీ రాయితీ ఇచ్చినట్టు ఎస్.ఈ.సి వెల్లడించింది. ఓ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్ విషయంలో తీవ్ర పోటీ ఉన్నందన ఒప్పందం చేజారకుండా ఉండేందుకు ఈ రాయితీ ఇవ్వాల్సి వస్తుందని సేల్ సిబ్బంది ఒరాకిల్ ఉన్నతాధికారులకు తెలియజేయగా, అందుకు వారు వెంటనే అనుమతి ఇచ్చినట్టు ఎస్ఈసీ విచారణలో వెల్లడైంది. 
 
అయితే, ఒరాకిల్‌పై ఎస్ఈసీ కన్నెర్ర చేయడం ఇది తొలిసారికాదు. పదేళ్ల కిందట కూడా ఒరాకిల్ ఇండియా విభాగంపై ఆరోపణలు రాగా, ఎస్ఈసీ రూ.16 కోట్ల జరిమానా వడ్డించింది.