పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్.. ఉద్యోగులు కాలు బయటపెట్టొద్దు.. ఐటీ సంస్థలు
కరోనా ఎఫెక్ట్, సెకండ్ వేవ్ కారణంగా ఐటీ కంపెనీలు ఇక పూర్తిగా వర్క్‌ఫ్రమ్ హోం ప్లాన్‌లో మునిగిపోయాయి. పలు రంగాలకు చెందిన కంపెనీలు వైట్ కాలర్ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని కోరాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఐబీఎం, రేమాండ్, మోతీలాల్ ఓస్వాల్, డెలాయిట్, శాప్ ఇండియా తదితర దిగ్గజ కంపెనీలు.. ఉద్యోగుల ఆరోగ్య భద్రతమే ప్రాధాన్యత ఇస్తున్నాయి.. పూర్తి వర్క్ ఫ్రమ్ హోంకే ప్లాన్ చేస్తున్నాయి.
ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం ఇవ్వడమే కాదు.. ఇక అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి కాలు బయటపెట్టవద్దని తమ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. తాజాగా.. ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావు ఉద్యోగులకు ఓ మెయిల్ పంపించారు. మీరు ఇంటికి నుంచి బయటకు వెళ్లినప్పుడు విధిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని మెయిల్‌లో సూచించారు.
మరోవైపు.. ఈ ఏడాది జూన్ చివరి వరకూ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని టీసీఎస్, ఐబీఎంలు కోరగా.. శాప్ ఇండియా ల్యాబ్స్ తమ బెంగళూర్ క్యాంపస్‌లో అర్హులైన ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా చేపట్టింది. ఐటీసీ సైతం తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ముందస్తు అనుమతి లేనిదే ఏ ఒక్కరూ కార్యాలయానికి రావద్దని కోరింది. అంటే.. ఓవైపు.. ఉద్యోగులతో పని చేయించుకుంటూనే.. మరోవైపు.. వారి ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహిస్తున్నాయి ఐటీ కంపెనీలు.