శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (09:12 IST)

'థ్యాంక్స్ గివింగ్ డే' జూమ్ బంపర్ ఆఫర్.. ఏంటిది...?

ప్రముఖ వీడియో కాలింగ్ యాప్ జూమ్ తన వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. థ్యాంక్స్ గివింగ్ డే రోజున ఈ బ్రహ్మాండమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఆ ఆఫర్ ఏంటంటే.. 'థ్యాంక్స్ గివింగ్' రోజైన ఈ నెల 26న అర్థరాత్రి నుంచి తర్వాతి రోజు తెల్లవారుజామున 6 గంటల వరకు కాల్స్ విషయంలో ఎటువంటి ఆంక్షలు ఉండబోవని, అపరిమితంగా మాట్లాడుకోవచ్చని తెలిపింది. 
 
వీడియో కాలింగ్‌పై  ప్రస్తుతం ఉన్న 40 నిమిషాల పరిమితిని ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్టు పేర్కొంది. థ్యాంక్స్ గివింగ్ రోజున తమ కుటుంబ సభ్యులతో నచ్చినంత సేపు మాట్లాడుకోవచ్చని ప్రకటించింది. 
 
కరోనా వైరస్ సమయంలో 'జూమ్' యాప్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దాదాపు సంస్థలన్నీ తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు కల్పించడంతో మీటింగ్‌ల కోసం జూమ్‌ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. 
 
అలాగే, విద్యార్థుల ఆన్‌లైన్ క్లాసులకు జూమ్ వినియోగం పెరిగింది. అయితే, ఉచిత కాలింగ్ 40 నిమిషాలకు పరిమితం చేసింది. ఆ సమయం ముగిసిన తర్వాత కాల్ కట్ అయిపోతుంది. మళ్లీ కాల్ చేయాలనుకుంటే కనుక నిర్ణీత సమయం వరకు ఆగాల్సి వచ్చేది. 
 
గూగుల్ మీట్ సహా జూమ్ ప్రత్యర్థులు కూడా ఇలాంటి ఆంక్షలే విధించారు. అయితే, జూమ్‌తో పోలిస్తే ఈ నిడివి కాస్త ఎక్కువ. గూగుల్ మీట్‌లో 60 నిమిషాల పరిమితి ఉంది. ఆ తర్వాత కూడా మాట్లాడుకోవాలనుకుంటే ప్లాన్లకు అనుగుణంగా రుసుము వసూలు చెల్లించాల్సివుంటుంది.