శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (12:28 IST)

నిన్న జీవీఎల్‌ (బీజేపీ)కు చెప్పుదెబ్బ.. నేడు హార్దిక్‌ (కాంగ్రెస్)కు చెంపదెబ్బ

ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేకుండా రాజకీయ నేతలపై ఓటర్లు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో యూపీకి చెందిన శక్తి భార్గవ్ అనే వైద్యులు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావుపై చెప్పును విసిరివేశాడు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఒకపుడు బీజేపీ సానుభూతిపరుడు కాగా, ఇపుడు ఏ కాంగ్రెస్ మద్దతుదారుడుగా ఉన్నాడు. 
 
ఈ ఘటన మరచిపోకముందే కాంగ్రెస్ యువ నేత, గుజరాత్ పటీదార్‌ ఉద్యమ చిచ్చరపిడుగు హార్దిక్‌ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సురేందర్‌ నగర్‌ జిల్లా నిర్వహించిన జన ఆక్రోష్‌ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో హార్దిక్‌ పటేల్‌ మాట్లాడుతుండగా... ఓ వ్యక్తి ఆయన చెంప ఛెళ్లుమనిపించాడు. ఊహించని ఘటనతో హార్దిక్‌ అవాక్కవ్వగా.. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ వ్యక్తిని చితకబాదారు. 
 
ఇకపోతే, గత మార్చి నెలలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన హార్దిక్ పటేల్.. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో జామ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావించాడు. కానీ 2015లో పటీదార్‌ రిజర్వేషన్‌ ఉద్యమం సందర్భంగా జరిగిన దాడి వెనుక హార్దిక్‌ ప్రోద్బలం ఉందంటూ మెహ్‌సనా జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు.. హార్దిక్ పటేల్‌కు రెండేళ్ళ జైలుశిక్ష విధించింది. దీంతో అతని ఆశలు అడియాశలయ్యాయి. ఈ తీర్పు కూడా గత యేడాది వెల్లడైంది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు.