1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (09:46 IST)

కర్ణాటకలోని శివమొగ్గ రైల్వే క్రషర్ వద్ద పేలిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి

Sivamogga
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జిలెటిన్‌ స్టిక్స్‌ లోడుతో ఉన్న ఓ ట్రక్కు పేలిపోయిన ఘటనలో 8మంది మరణించారని జిల్లా కలెక్టర్‌ కేబీ శివకుమార్‌ వెల్లడించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది. శివమొగ్గ జిల్లాలోని హుణసోడు అనే గ్రామంలో ఉన్న క్రషింగ్‌ సైట్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పేలుగు జరిగిన సమయంలో ట్రక్కులో పలువురు కార్మికులు ఉన్నారు. శుక్రవారం రాత్రి 10.20 గంటల సమయంలో పేలుడు సంభవించింది. పొరుగున ఉన్న చిక్‌మగళూరు జిల్లా వరకు ఈ శబ్దాలు వినిపించాయి.
 
మొదట్లో ఈ శబ్దాలు, వాటివల్ల కలిగిన ప్రకంపనలను భూకంపంగా భావించి స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. చాలా ఇళ్ల కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. ప్రమాద ఘటనపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ట్వీట్‌ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.