Agneepath: ఇలా రైళ్లకి నిప్పు పెట్టే పోకిరీలు ఆర్మీకి పనికిరారు: మాజీ సైన్యాధిపతి మాలిక్ వ్యాఖ్యలు
అగ్నిపథ్ పథకం అర్థంకానివాళ్లు ఇలాంటి దాడులు చేస్తున్నారనీ, రైళ్లు, బస్సులపై రాళ్ల దాడి చేస్తూ దేశ ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే పోకిరీలు సైన్యానికి పనికిరారంటూ మాజీ ఆర్మీ చీఫ్ మాలిక్ అన్నారు. అగ్నిపథ్ అద్భుతమైన పథకమనీ, ఆ పథకం ద్వారా ఎందరో దేశానికి సేవ చేసే అవకాశం వుంటుంది చెప్పారు.
ఉత్తరాది రాష్ట్రాలతో పాటు సికింద్రాబాదులో జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, దాడులపై మాలిక్ స్పందించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఆర్మీ తీసుకోదని చెప్పారు. సాయుధ బలగాలనేవి దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవే కానీ వారికి సమస్యగా ఎన్నటికీ కాదన్నారు. బలగాల్లో దేశం కోసం పోరాడే ఉత్తమ పౌరులు కావాలనీ, ఇలా రైళ్లకి నిప్పు పెట్టే పోకిరీలు కాదన్నారు.
ఇటీవల ఆర్మీ రిక్రూట్మెంట్ ఆపివేసినందువల్ల పరీక్ష పూర్తిచేయనివారు ఎంతోమంది వుండివుండవచ్చు. అలాంటివారిలో కొందరి వయసు ఆర్మీలో ప్రవేశ వయసును దాటిపోయి వుండవచ్చు. ఐతే ఈ సమస్యను తను అర్థం చేసుకోగలననీ, అలాగని దాడులు చేస్తే ఎట్లా అని ప్రశ్నించారు. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత అందులో ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని తను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.