శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జూన్ 2022 (15:45 IST)

'అగ్నిపథ్' స్కీమ్‌పై తీవ్ర ఆందోళనలు.. జన శతాబ్ధిని కదలనివ్వలేదు

indian army
కేంద్రం ప్రకటించిన 'అగ్నిపథ్' స్కీమ్‌పై తీవ్ర విమర్శలు, ఆందోళనలు అధికమవుతున్నాయి. రక్షణ శాఖలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగ నియమాకాలపై కేంద్రం ప్రవేశపెట్టిన ఈ అగ్నిఫథ్ స్కీమ్‌పై యువత మండిపడుతోంది. 
 
అగ్నిపథ్ స్కీమ్ కింద రక్షణ శాఖ సర్వీసుల్లో చేరే యువత నాలుగేళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత కేవలం 25 శాతం మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తారు. మిగతావారికి రూ.12 లక్షల ప్యాకేజీ ఇచ్చి ఉద్యోగం నుంచి పంపిస్తారు. 
 
వీరికి ఫించన్ సౌకర్యం ఉండదు. కేంద్రం ప్రకటించిన ఈ స్కీమ్ యువతలో ఆగ్రహావేశాలను రగిలించింది. ఇలాంటి రిక్రూట్‌మెంట్ పాలసీలు యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
కేవలం నాలుగేళ్ల కాల పరిమితితో యువకులను ఉద్యోగాల్లోకి తీసుకోవడమంటే.. వారి భవిష్యత్తును బలిపెట్టడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
కేంద్రం ప్రకటించిన ఈ స్కీమ్‌ పట్ల యువత నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా బీహార్ యువత ఈ స్కీమ్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలకు దిగారు. రోడ్లు, రైలు పట్టాల పైకి చేరి నిరసన తెలియజేశారు.
 
పలుచోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. శరన్ జిల్లాలోని ఛప్రా వద్ద నిరసనకారులు ఓ ప్యాసింజర్ రైలుకు నిప్పంటించారు. ఆరా రైల్వే స్టేషన్ వద్ద నిరసనకారులు రాళ్లు రువ్వారు. బక్సర్ జిల్లాలో దాదాపు 100 మంది యువత రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి రైలు పట్టాలపై బైఠాయించారు. జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ను 30 నిమిషాల పాటు అక్కడినుంచి కదలనివ్వలేదు.
 
పాట్నా రైల్వే స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున గుమిగూడిన నిరసనకారులు రోడ్డుపై వాహనాల టైర్లకు నిప్పంటించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.