ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (18:06 IST)

కమల వికాసం : గుజరాత్ - హిమాచల్‌‍లో బీజేపీదే గెలుపు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేయనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీనే ఆధిక్యంలో ఉంది. దీంతో మరోమారు కాంగ్రెస్ పార్టీకి ఓటమిని చవిచూడాల్సిన పరిస్

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీనే ఆధిక్యంలో ఉంది. దీంతో మరోమారు కాంగ్రెస్ పార్టీకి ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. ఇందులో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రత్యేకించి రాజ్‌కోట్ వెస్ట్ స్థానంలో బీజేపీ ప్రతిష్టాత్మక అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విజయబావుటా ఎగురవేశారు. ఆయనకు గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రానిల్ రాజ్‌గురుపై దాదాపు 21 వేల ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. 
 
నిజానికి ఈ స్థానంలో విజయం వీరిద్దరి మధ్య దోబూచులాడింది. ఒకానొక స్థాయిలో విజయ్ రూపానీపై రాజ్‌గురు 6 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యం కనబర్చడంతో విజయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు విజయ్ రూపానీ విజయం సాధించడంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, గుజరాత్‌లో బీజేపీ 99 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 80, ఇతరులు 03 సీట్లకే పరిమితమయ్యారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు కావాల్సి ఉంది. 
 
ఇకపోతే, హిమచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో కమలం విరబూసింది. అధికార కాంగ్రెస్‌కు షాకిస్తూ అధికారం చేపట్టే దిశగా బీజేపీ అనూహ్య రీతిలో విజయాన్ని సొంతం చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని 68 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 44 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ కేవలం 21 స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది. ఇతరులు 03 స్థానాల్లో గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్‌లో అధికారం చేపట్టడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 35.