సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (12:15 IST)

అయోధ్య తీర్పుపై రాజ్‌నాథ్ సింగ్ ఏమన్నారు? బాబ్రీ కూల్చివేత చట్ట ఉల్లంఘనే

రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని, అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని సంచలన తీర్పు ఇచ్చింది. 
 
అయోధ్య రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేసిన ముగ్గురు మధ్యవర్తుల బృందాన్ని సుప్రీంకోర్టు ప్రశంసించింది. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి పరిష్కారానికి దగ్గరగా వచ్చారంటూ కితాబిచ్చింది. అయోధ్య వివాదంపై రాజీ కోసం జస్టిస్ కలీఫుల్లా, శ్రీరాం పంచు, శ్రీశ్రీ రవిశంకర్‌లను సుప్రీంకోర్టు మధ్యవర్తులుగా నియమించిన సంగతి తెలిసిందే. 
 
కాగా అన్ని విశ్వాసాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ సుప్రీంకోర్టు ఇవాళ చారిత్రక తీర్పు వెలువరించింది. బాబ్రీ మసీదు కూల్చివేత చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని పేర్కొంది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి కేటాయించింది. 
 
అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమైనదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. 
 
అయోధ్య వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘ఇది చారిత్రక తీర్పు అని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ దీన్ని అంగీకరించి, గౌరవించాలి. ప్రజలంతా శాంతి, సామరస్యాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం..’’ అని పేర్కొన్నారు.